తల్లిదండ్రులను ఆదరించని కొడుకుల భరతం పడతాం

Vikarabad Collector Umar Zaleel  - Sakshi

కఠినచర్యలు తీసుకుంటాం

జిల్లాలో కోటి 50 లక్షల మొక్కలను నాటుతాం

విధిగా లక్ష్యం చేరుకోవాలి

‘ధరణి’ సమస్యల పరిష్కారానికి చర్యలు

కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌

తాండూరు వికారాబాద్‌ : తల్లిదండ్రులను నిరాధారణకు గురిచేస్తున్న కొడుకుల భరతం పడతామని కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ హెచ్చరించారు. సొమవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆయన సమావేశంలో మాట్లాడారు. తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులను తమ కొడుకులు పట్టించుకోవడం లేదని అర్జీ అందిందని తెలిపారు. తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోని కొడుకులపై 2007 చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

తల్లిదండ్రులను ఆదరించనివారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఏదైనా కార్యక్రమం నిర్వహించిన సమయంలో జాతీయగీతాలాపన తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశా రు. ధరణి వెబ్‌సైట్‌లో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1.78  లక్షల పట్టా పాసుబుక్కులు జారీ చేయాల్సి ఉండగా 1.58లక్షల పుస్తకాలను ఇప్పటికే పంపిణీ చేసినట్లు వివరించారు. రైతులకు అందించిన పాసుబుక్కుల్లో దాదాపు 8వేల తప్పులు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.

జిల్లావ్యాప్తంగా 3127 పట్టా పాసుబుక్కుల్లో తప్పిదాలను త్వరలో సరి చేస్తామన్నారు. ఆయా గ్రామాల్లో కోటి 50 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 90 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉన్న మొక్కలను నాటేందుకు ప్రభుత్వశాఖల అధికారులకు లక్ష్యం నిర్దేశించినట్లు తెలియజేశారు. ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలో ఉన్న 1.48 లక్షల మహిళా సంఘాల ద్వారా మొక్కలను నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. జిల్లాలో 92 అటవీ ప్రాంతాలు ఉండగా అందులో 49 ప్రాంతాల్లో అటవీసంపద కనుమరుగైందని కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గనుల శాఖ ద్వారా డీఎంఎఫ్‌టీకి సమకూరుతున్న నిధులతో అక్రమ రవాణానుఅడ్డుకునేందుకు రూ.30 లక్షలతో చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతే కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యాన్ని నియంత్రించేందుకు గనులు ఉన్న గ్రామాలకు రోడ్లతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

తాండూరు మండలంలో రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, అందులో రూ.30 కోట్లు రూర్బన్‌ నిధులు ఉన్నాయని చెప్పారు. సోలార్‌ దీపాలు, భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జాన్సన్, ఆర్డీఓ వేణుమాధవరావు, తాండూరు తహసీల్దార్‌ రాములు ఉన్నారు.      
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top