వాహనాలకు కేటాయించే సిరీస్‌పై స్పష్టత రాని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది.
-
ఇంకా అందని కేంద్ర ఉత్తర్వులు
-
తెలంగాణలో కొత్త వాహనాలకు
-
నంబర్లు పెండింగ్
-
అందుబాటులోకి రవాణా శాఖ వెబ్‌సైట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. వాహనాలకు కేటాయించే సిరీస్‌పై స్పష్టత రాని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. తెలంగాణకు టీజీ సిరీస్ కేటాయిస్తూ నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే టీజీ బదులు టీఎస్(తెలంగాణ స్టేట్) సిరీస్‌ని కేటాయించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించడంతో ఈ మేరకు రవాణా శాఖ అధికారులు కేంద్రానికి కొత్త ప్రతిపాదనలు పంపారు.
దీంతో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కేం ద్రం.. కొత్త నోటిఫికేషన్ జారీకి సిద్ధమైంది. కానీ సోమవారం కూడా దీనికి సంబంధించి ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో ఇది వాహన రిజిస్ట్రేషన్లపై ప్రభావం చూపింది. ఇప్పటికే వాహనదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు.. నం బర్ల్ల కేటాయింపును మాత్రం పెండింగులో పెట్టారు. తాత్కాలికంగా టీఎస్ పేరుతో నంబర్లను సిద్ధం చేసుకున్నా.. ఆ సిరీస్ విషయంలో లిఖితపూర్వక ఉత్తర్వులు అందే వరకు కేటాయింపులు చేయకూడదని అధికారులు నిర్ణయించారు. ఇక తెలంగాణ రాష్ర్ట రవాణా శాఖకు కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు.
అలాగే వెంకటేశ్వర్లు, పాండురంగారావులను జాయిం ట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లుగా తెలంగాణకు కేటాయిం చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీనివాస్, సుధాకర్, ప్రసాదరావులను కేటాయించారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయభవనం మొదటి అంతస్తును ఆంధ్రప్రదేశ్‌కి, రెండో అంతస్తును తెలంగాణ రాష్ట్రానికి, మూడో అంతస్తులోని తూర్పు భాగాన్ని ఆంధ్రప్రదేశ్‌కు, పశ్చిమ భాగాన్ని తెలంగాణకు కేటాయించారు. రవాణా శాఖ కార్యకలాపాలను ఈ-సేవతో అనుసంధానించడం, స్లాట్ బుకింగ్ కనెక్టివిటీ తదితర సౌకర్యాలను రెండు రాష్ట్రాలకు విడివిడిగా ఏర్పాటు చేశారు.