నేటి నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్
రాష్ట్రప్రభుత్వ వాహనాలకు ‘కేఎల్90’, ‘కేఎల్90డీ’
కేంద్ర ప్రభుత్వ వాహనాలకు ‘కేఎల్90ఏ’, ‘కేఎల్90ఈ’, ‘కేఎల్90బీ’
స్థానిక సంస్థలకు కేఎల్90ఎఫ్’ సిరీస్
ప్రభుత్వ రంగ సంస్థలకు ‘కేఎల్90సీ’
తిరువనంతపురం: ప్రభుత్వ వాహనాల విషయంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో ఏకరూపత పాటించాలని నిర్ణయించింది. ఇకపై రిజిస్ట్రేషన్ చేయించే ప్రభుత్వ వాహనాలకు ‘కేఎల్90’ సిరీస్‌ను కేటాయించాలంటూ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ప్రభుత్వ ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్రప్రభుత్వ వాహనాలను ‘కేఎల్90’, ‘కేఎల్90డీ’ సిరీస్‌లలో రిజిస్టర్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ వాహనాలకు ‘కేఎల్90ఏ’, ‘కేఎల్90ఈ’, ‘కేఎల్90బీ’ సిరీస్‌లను కేటాయిస్తారు. స్థానిక సంస్థల వాహనాలకు కేఎల్90ఎఫ్’ సిరీస్, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, విశ్వవిద్యాలయాల వాహనాలకు ‘కేఎల్90సీ’ సిరీస్‌లో రిజిస్ట్రేషన్లు చేస్తారు.
ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ఈరోజు(నవంబరు 1) నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల విధానం అమల్లోకి వచ్చింది. అయితే.. ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండదు. ప్రభుత్వ వాహనాలన్నీ తిరువనంతపురంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో.. 9వ నంబర్ మోటారు వాహన ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) వింగ్ వద్ద మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వ వాహనాలకు జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లు జరిగేవి.


