సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికే ప్రాధాన్యం

Uttam Kumar Reddy Says We Will Support Singareni Employees - Sakshi

డిస్మిస్‌ కార్మికులకు మరో అవకాశం కల్పిస్తాం

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేస్తాం

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మంచిర్యాలలో ప్రజాచైతన్య యాత్ర

సాక్షి, మంచిర్యాల అర్బన్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికే తొలిప్రాధాన్యత ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసానిచ్చారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో ఐదు రోజలపాటు నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగంతో ప్రజలను ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన కార్మికులను అధికారం చేపట్టాక నమ్మించి మోసం చేసిన చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెల్లుతుందని విమర్శించారు. సింగరేణి డిస్మిస్‌ కార్మికులకు ఉద్యోగాలు, డిపెండెంట్‌ ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్, రూ.10 లక్షల ఇళ్ల రుణాలంటూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తి చేసిన జైపూర్‌ పవర్‌ప్లాంట్‌ను స్విచ్‌ ఆన్‌చేసి తమ ఘనతేనని చెప్పుకోవడం సిగ్గుచేటని ఉత్తమ్‌ విమర్శించారు. 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే డిస్మిస్‌ కార్మికులకు మరోసారి అవకాశం కల్పించడం, డిపెండెంట్‌ ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల పర్మినెంట్‌ చేస్తామని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో చేపట్టిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి జిల్లాకు నీరందించేందుకు పనులు ప్రారంభిస్తే.. కేసీఆర్‌ వచ్చిన తర్వాత ఏం చేసిండో ప్రజలు గమనించాలని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ తాగునీరు, సాగునీరు అందించాలనే సంకల్పంతో నిర్మిస్తే తామే నిర్మించినట్లు నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాకు రావాల్సిన 1శాతం నీటిని తాగునీరు, సాగునీరు కాంగ్రెస్‌ ఇస్తుందని భరోసానిచ్చారు.

రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే..
గిట్టుబాటు ధర కల్పించాలని అడిగిన పాపానికి రైతులకు బేడీలు వేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టివిక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. శాసనమండలి ఉపనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో తొమ్మిది రకాల నిత్యావసర సరకులు చౌకధరల దుకాణాల ద్వారా అందిస్తే టీఆర్‌ఎస్‌ హయాంలో ఏం ఇస్తుందో ప్రజలకు తెలియంది కాదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శిస్తున్న కేటీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధ్వజమెత్తారు.

పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీలో వేల కోట్లు సంపాదించిన మాజీ ఎంపీ వివేక్, వినోద్‌లు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం దుర్మార్గమైన చర్య అంటూ వారిపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌  అధికారంలోకి వచ్చాక మోసం చేయని వారెవరున్నారని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి, మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళల ఉద్యమంతో అధికార పీఠం ఎక్కిన కేసీఆర్‌ను మహిళలలే ఇంటిబాట పట్టిస్తారని చెప్పారు. దేశంలో ప్రజావేదికలు, పోరాటలను ధ్వంసం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్‌ మాత్రమేనని ప్రజా గాయకుడు గద్దర్‌ కుమారుడు సూర్యం ఆరోపించారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తోందని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించే తీరిక లేదని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే కాకముందే రెండు రోజులకోకసారైనా నీరొచ్చేదని, ఇప్పుడు వారం రోజులైనా నీరు రాకుండా పోయిందని ఆరోపించారు. సింగరేణి కార్మికుల కుటుంబాల్లో డిపెండెంట్‌ పేరిట చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మె ల్యే తండ్రి పేరిట ప్రభుత్వ భూమి రికార్డులోకి ఎక్కిస్తే అందరం కలిసికట్టుగా కొట్లాడడంతోనే తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు.

మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ కమీషన్ల కోసం మిషన్‌భగరీథగా అభివర్ణించారు. మున్సి పాల్టీలో వాళ్లు నీరుసరఫరా చేయరు.. తాను చేస్తానంటే నీళ్లు ఇవ్వరు ఇదెక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇవ్వకున్నా తానే సొంతంగా బోరు వేయించుకుని నీటి సరఫరా చేస్తున్నానని తెలిపారు. వైఎస్సార్‌ కలల ప్రాజెక్టు ప్రాణహిత–చేవేళ్ల ద్వారా ఉమ్మడి జిల్లాలో తూర్పు ప్రాంతంలో 3లక్షల ఎకరాలకు సాగునీరుతోపాటు తాగునీరందేదని, ఐదుగురు చవుటదద్దమ్మల ఎమ్మెల్యేల వల్ల నీరురాకుండా పోయిందని ధ్వజమెత్తారు. జిల్లాకు నీరందిస్తారా లేదా రాజీనామాలు చేస్తారో తేల్చుకోవాలని సవాల్‌ చేశారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శాసనమండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, రామచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, నరేష్‌జాదవ్, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top