
టీఆర్‌ఎస్ కార్యాలయంగా అసెంబ్లీ
ప్రతిపక్షపార్టీలను అసెంబ్లీలో లేకుండా చేస్తూ టీఆర్‌ఎస్ కార్యాలయంగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షపార్టీలను అసెంబ్లీలో లేకుండా చేస్తూ టీఆర్‌ఎస్ కార్యాలయంగా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీని నడిపిస్తున్న తీరు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవహారశైలిపై టీఆర్‌ఎస్‌లోని సీనియరు ఎమ్మె ల్యేలు, కొందరు మంత్రులు కూడా అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా, గొంతునొక్కే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు ఇప్పుడు మంత్రిగా ఉన్న హరీశ్‌రావు చేసిందేమిటో గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపి, వాకౌట్ చేస్తే పార్టీ మారిన పువ్వాడ అజయ్‌తో అసెంబ్లీలో మాట్లాడించడం స్పీకర్‌కు తగదన్నారు.