జలం జాడేది?

Underground waters Down Fall in Hyderabad - Sakshi

శరవేగంగా పడిపోతున్న భూగర్భ నీటిమట్టం

సీజన్‌లో తగ్గిపోయిన వర్షపాతం

హైదరాబాద్‌లో 31 శాతం, రంగారెడ్డిలో 26 శాతం నమోదు  

సాక్షి,సిటీబ్యూరో: మహానగరానికి నీటి కరువు ముంచుకొస్తోంది. భూగర్భ జలాలు శరవేగంగా పడిపోతున్నాయి. శీతాకాలంలోనే ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుండడం గమనార్హం. ఈ సారి నైరుతి రుతుపవన సీజన్‌లో నగరంలో 31 శాతం తక్కువ వర్షపాతం నమోదుకావడం.. కురిసిన అరకొర వర్షపు నీరు సైతం భూగర్భంలోకి ఇంకే అవకాశం లేకపోవడంతో అక్టోబర్‌ మాసంలోనే పాతాళగంగ అథఃపాతాళంలోకి పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంటే రాబోయే వేసవిలో భూగర్భజలాల లభ్యతపై ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా గ్రేటర్‌లో అక్టోబర్‌ నాటికి సరాసరిన 3.28 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ కనిపిస్తుంది. కానీ ఈసారి ఏకంగా 7.39 మీటర్ల లోతునకు వెళితేగాని నీటి ధారల జాడ కనిపించని పరిస్థితి. అంటే సాధారణం కంటే 4.11 మీటర్ల లోతుకు నీటిమట్టాలు పడిపోవడం గమనార్హం. పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లాలో గతేడాది 10.28 మీటర్ల లోతున నీరు ధారలు టిలభించగా.. ఈసారి 17.12 మీటర్ల లోతుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ జిల్లాలోనూ సరాసరిన 6.84 మీటర్ల మేర నీటిమట్టాలు పడిపోవడంగమనార్హం.

పాతాళంలోకి భూగర్భజలాలు
గ్రేటర్‌ పరిధిలో పలు మండలాల్లో గతేడాది అక్టోబర్‌ నెలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో నీటిమట్టాలు అనూహ్యంగా తగ్గిపోయాయి. ప్రధానంగా నైరుతి సీజన్‌లో నమోదు కావాల్సిన వర్షపాతంలో 31 శాతం మేర తగ్గిపోవడం.. కురిసిన అరకొర వర్షం నీరు సైతం నేలలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు అథఃపాతాళంలోకి చేరడానికి ప్రధాన కారణమని భూగర్భ జలశాఖ నిపుణులు ‘సాక్షి’కి తెలిపారు. మహానగరం పరిధిలో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాల సంఖ్య 14 లక్షలుకాగా.. ఇంకుడు గుంతలు లక్షకు మించి లేకపోవడం.. మరోవైపు విచక్షణా రహితంగా బోరుబావులు తవ్వి భూగర్భ జలాలను తోడేస్తుండడంతో ఈ పరిస్థితికి ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు.

నిరాశాజనకంగా నైరుతి..
ఈసారి నైరుతి రుతుపవనాలు గ్రేటర్‌ను నిరాశపరిచాయి. రాజధాని హైదరాబాద్‌ నగరంతో పాటు నగరాన్ని ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో జూన్‌–సెప్టెంబర్‌(నైరుతి రుతుపవనాల కాలం) మధ్యలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో ఈ రెండు జిల్లాల పరిధిలోని పలు జలాశయాల్లో వర్షపునీరు చేరే దారిలేక చిన్నబోయి కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో సాధారణంగా నైరుతి సీజన్‌లో 580.9 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం పరిపాటి. అయితే, ఈసారి మాత్రం 401.7 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 31 శాతం తక్కువగా నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లాలో సాధారణ వర్షపాతం 525.9 మిల్లీమీటర్లు కాగా.. ఈ సీజన్‌లో కేవలం 386.8 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం.

పెరుగుతోన్న వేడిమి..
నైరుతి రుతుపవనాలను తిరోగమించడంతో ప్రస్తుతం వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. గురువారం నగరంలో 32.4 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండవేడి ప్రభావం కనిపించింది. మరోవైపు గాలిలో తేమశాతం 65 శాతం నుంచి 50–55 శాతానికి పడిపోయింది. దీంతో వాతావరణంలో వేడిమి పెరిగి చర్మం, కళ్ల మంటలు, శ్వాసకోశ సమస్యలతో గ్రేటర్‌ ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top