మరింత లోతుల్లోకి పాతాళ గంగ


* రాష్ట్రంలో 13.17 మీటర్లకు దిగజారిన భూగర్భ జలాలు

* మెదక్ జిల్లాలో 22.59 మీటర్లు

* నిజామాబాద్ జిల్లాలో 17.78 మీటర్లకు

* రబీలో 76 శాతం లోటు వర్షపాతం


 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. గత ఖరీఫ్ మొదలు రబీ వరకు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. 2014 డిసెంబర్‌లో రాష్ట్రంలో 10.24 మీటర్ల లోతుల్లో భూగర్భ జలాలు ఉండగా, 2015 డిసెంబర్‌లో 13.17 మీటర్ల లోతుల్లోకి అడుగంటాయి. ఏకంగా 2.93 మీటర్ల అదనపు లోతుల్లోకి దిగజారాయి. బోర్లు వట్టిపోయాయి. బావులు ఎండిపోయాయి. ఫలితంగా తాగునీటి సమస్య ఏర్పడింది. మెదక్ జిల్లాలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఆ జిల్లాలో 2014 డిసెంబర్‌లో 15.84 మీటర్ల లోతులో నీరు లభిస్తే, గత నెలలో ఏకంగా 22.59 మీటర్లకు అడుగంటింది. ఏకంగా 6.75 మీటర్ల అదనపు లోతుల్లోకి వెళ్లింది.



ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 2014 డిసెంబర్‌లో 11.06 మీటర్ల లోతులో నీరు ఉండగా, 2015 డిసెంబర్‌లో 17.78 మీటర్లకు పడిపోయింది. ఏకంగా 6.72 మీటర్ల అదనపు లోతుల్లోకి జలాలు దిగజారిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 3.89 మీటర్ల అదనపు లోతుల్లోకి అడుగంటాయి. రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలోనూ ఏడాది కాలంగా భూగర్భ జలం పైకి రాకపోగా, ఇంకా అదనపు లోతుల్లోకి పడిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అటు ప్రజలనూ, ఇటు అధికారులనూ పట్టిపీడిస్తోంది. అంతేకాదు 2015 నవంబర్‌లో రాష్ట్రంలో 12.39 మీటర్ల లోతుల్లో పాతాళ గంగ లభిస్తే, ఒక్క నెల రోజుల్లోనే 13.17 మీటర్ల లోతుల్లోకి పడిపోయింది. రబీ సీజన్‌లో సాధారణంగా ఇప్పటివరకు 133 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 32 మీటర్లే నమోదై 76 శాతం లోటు కనిపిస్తోంది.



 9 శాతానికి మించని వరినాట్లు

 రబీలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సాగు 35 శాతానికి మించలేదు. అందులో వరి నాట్లు 9 శాతానికి మించలేదు. రబీలో సహజంగా 31.32 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 11.10 లక్షల ఎకరాల్లోనే (35%) సాగు జరిగింది. అందులో వరి సాధారణంగా 16.12 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు లక్షన్నర ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఒక్క పప్పుధాన్యాల సాగు మాత్రమే 95 శాతం జరిగింది. సాధారణంగా 3.45 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు జరగాల్సి ఉండగా... ఇప్పటివరకు 3.27 లక్షల ఎకరాల్లో జరిగింది. వరి నాట్లు అత్యంత దారుణంగా పడిపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని వ్యవసాయశాఖ చెబుతోంది. ఆరుతడి పంటలు వేయాలని సూచిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top