వర్సిటీల ‘పరిధి’ మార్పులపై కసరత్తు!

UGC says that only 200 colleges should be in each university - Sakshi

     వేగవంతం చేసిన ఉన్నత విద్యా మండలి

     ప్రతి వర్సిటీ పరిధిలో 200 కాలేజీలే ఉండాలన్న యూజీసీ 

     ఆ మేరకు మార్పులతో ప్రతిపాదనలు సిద్ధం 

     త్వరలోనే ప్రభుత్వానికి అందజేత

     పాలక మండలి సమావేశంలో చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీల భౌగోళిక పరిధుల మార్పులపై ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు చేయాల్సిన మార్పులతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమగ్ర అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కూడా వర్సిటీల పరిధిలో అనుబంధ కాలేజీలు 200కు మించి ఉండటానికి వీల్లేదని, అంతకంటే ఎక్కువ కాలేజీలు ఉన్న వర్సిటీలకు నిధులను ఇవ్వబోమని స్పష్టం చేసింది.

ఇటీవల ఢిల్లీలో జరిగిన రెండో దశ రూసా సమావేశంలోనూ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో యూనివర్సిటీల పరిధిలోని అనుబంధ కాలేజీలను ఎలా తగ్గించాలన్న అంశంపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 500కు పైగా అనుబంధ కాలేజీలు ఉండగా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనూ 300కు పైగా కాలేజీలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో 280కి పైగా అనుబంధ కాలేజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పరిధిలోని కాలేజీలను కొన్నింటిని ఇతర యూనివర్సిటీల పరిధిలోకి తీసుకెళ్లేలా విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

వీలైనన్నిమార్పులు 
ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పాత వరంగల్‌ జిల్లాతోపాటు పాత ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నుంచి పాత ఆదిలాబాద్‌లోని కొన్ని కొత్త జిల్లాలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి, మరికొన్నింటిని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి, ఇంకొన్నింటిని మçహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోకి మార్చేలా విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఓయూ పరిధిలోని జిల్లాలు కొన్నింటిని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి, ఇంకొన్నింటిని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి, మరికొన్నింటిని మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోకి మార్పు చేసేలా చర్యలు చేపడుతోంది.

అయితే ఇలా మార్పులు చేసినా ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో అనుబంధ కాలేజీలు 200కు పైగానే ఉండే అవకాశం ఉంది. దీంతో వీటిపై ఏం చేయాలన్న దానిపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కర్ణాటకలో ఇదే పరిస్థితి ఉండటంతో అక్కడ ఒక్కో యూనివర్సిటీని వేర్వేరు పేర్లతో విభజించారు. అదే విధానంలో ఇక్కడ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అందుకే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. పరిధుల మార్పు ప్రతిపాదనలు కూడా త్వరలోనే పంపించాలని భావిస్తోంది. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలోనూ దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top