కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణం తీశాయి. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. పెంచి పెద్దచేయాల్సిన ఆ చేతులతో బిడ్డకు విషమిచ్చింది.
పెద్దూరు(తెలకపల్లి): కుటుంబ కలహాలు ఇద్దరి ప్రాణం తీశాయి. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. పెంచి పెద్దచేయాల్సిన ఆ చేతులతో బిడ్డకు విషమిచ్చింది. తానూ కూడా తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం మండలంలోని పెద్దూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పొనుగంటి రాధ(25), తిరుపతయ్య భార్యాభర్తలు. వీరికి ఆరునెలల కొడుకు ఉన్నాడు. భార్యాభర్తలు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇద్దరిమధ్య ఇటీవల గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆమె మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కొడుకుకు పురుగుమందు తాపింది. తాను కూడా తాగింది. భర్త వచ్చి చూసేలోగా ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఆరునెలల కొడుకుతో తల్లి చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏం కష్టమొచ్చిందో.. ఏమో కన్నపేగును కంపి తాను చనిపోవడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.