నిషేధం ఉన్నట్టా? లేనట్టా?

tsfdc called tenders for thunikaku - Sakshi

అభయారణ్యంలో ఈ ఏడాది టార్గెట్‌ 5000 స్టాండర్డ్‌ బ్యాగులు 

సందిగ్ధంలో తునికాకు సేకరణ కూలీలు

పాల్వంచ (రూరల్‌) : అభయారణ్యంలో వన్యప్రాణుల ఉనికికి ముప్పు వాటిల్లితుందని, దహనంతో అటవీ ప్రాంతం అంతరించి పోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి తునికాకు సేకరణను నిషేధిస్తూ జనవరిలో నిర్ణయం తీసుకుంది. సంబంధిత శాఖాధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాత్రం ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 295 యూనిట్లు, 2115 కల్లాల్లో 2,82,800 స్టాండర్డ్‌ బ్యాగుల తునికాకు సేకరణకోసం ఈనెల 9వ తేదీన ఈ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం నిషేధించిన కిన్నెరసాని అభయారణ్యంలోని 6 యూనిట్లు, 63 కల్లాల్లో ఈసారి 5000 స్టాండర్డ్‌బ్యాగ్‌ల తునికాకు సేకరణ లక్ష్యంగా నిర్దేశించింది. దీంతో ఈ సారి ఆభయారణ్యంలో తునికాకు సేకరణపై నిషేధం ఉన్నట్లా? లేనట్లా? అని సందిగ్ధంలో కూలీలు, గిరిజనులు ఉన్నారు. 

రూ.25లక్షల ఆదాయం 
తునికాకు సేకరణ ద్వారా ప్రతి సంవత్సరం కిన్నెరసాని అభయారణ్యంలోని 6 యూనిట్లలోని 63 కల్లాల ద్వారా అటవీశాఖకు రూ.25లక్షల ఆదాయం లభిస్తుంది. ఆకు సేకరణ ద్వారా దాదాపు వందలాదిమంది గిరిజన కూలీలకు మూడునెలలపాటు ఉపాధి దొరుకుతుంది. గత ఏడాది నిర్దేశించిన 5050 స్టాండర్డ్‌బ్యాగ్‌ల సేకరణ లక్ష్యంగా ఆకుల సేకరణ జరిపారు. గత రెండు సంవత్సరాలనుంచి అటవీశాఖ ఇచ్చే బోనస్‌ డబ్బులు కూడా ఇంత వరకు ఇవ్వలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఎలాంటి ఆదేశాలు రాలేదు
కిన్నెరసాని అభయారణ్యంలో తునికాకు సేకరణ ద్వారా వన్యప్రాణులు, అటవీసంపదకు ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ఆకు సేకరణను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అభయారణ్యంలో తిరిగి తునికాకు సేకరణ జరుపాలని మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఫారెస్ట్‌ డెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ రొటీన్‌గా ఇచ్చి ఉంటారు.
    ఎం.నాగభూషణం(వైల్డ్‌లైఫ్‌ ఎఫ్‌డీఓ)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top