
టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు
టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఎంఐఎం పెట్రేగిపోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూమయ్య, జిల్లా తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ రావుల రాంనాథ్ విమర్శించారు.
నిర్మల్ అర్బన్ : టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఎంఐఎం పెట్రేగిపోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూమయ్య, జిల్లా తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ రావుల రాంనాథ్ విమర్శించారు. దేశాన్ని నడిపించేది రాజ్యాంగమని, మతపరమైన పాలన సాగడం లేదని తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.
నిర్మల్‌లోని మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసేందుకు నిరాకరించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అజీం బిన్ యాహియా, ఖమ్మం జిల్లాలో జెండా వందనానికి నిరాకరించిన పాఠశాల హెచ్‌ఎం షరీఫ్‌లపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని అగౌరవపర్చడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని, మున్సిపల్ వైస్ చైర్మన్ అజీం బిన్ యాహియాను బర్తరఫ్ చేయాలని అన్నారు.
సుమోటోగా కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్, ప్రధాన కార్యదర్శి నాయిడి మురళీ, అసెంబ్లీ కన్వీనర్ మెడిసెమ్మ రాజు, జిల్లా కార్యదర్శి పోశెట్టి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రచ్చ మల్లేష్, బీజేపీ నాయకులు హరివర్మ, ప్రేమ్‌కుమార్, రవి, శైలేష్, రాజే శ్వర్ తదితరులు పాల్గొన్నారు.