Ravula Ramnath
-
రాహుల్‌ది రాజకీయ యాత్ర
బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రావుల రాంనాథ్ నిర్మల్ రూరల్ : కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీది రైతు భరోసా యాత్రకాదని, కేవలం రాజకీయయాత్రేనని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రావుల రాంనాథ్ విమర్శించారు. మండలంలోని మంజులాపూర్‌లో బుధవారం బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని రైతుల కష్టాలు ఇప్పడు గుర్తుకు వచ్చాయా అని ఎద్దేవా చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 3లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాహుల్‌గాంధీ భరోసా యాత్ర 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర చేసినట్లు ఉందన్నారు. జిల్లాలో 600మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం ఐదుగురికే పరిహారం అంద జేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజకీయూల కోసమే రాహుల్ భరోసా యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాళం నరేంధర్, ప్రధాన కార్యదర్శి సాయేంధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు అయిండ్ల రమేష్, నాయకులు చిన్ను, పడాల సతీష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తినింపిన అమిత్‌షా పర్యటన
నిర్మల్ అర్బన్ : హైదరాబాద్‌లో ఈ నెల 21, 22వ తేదీల్లో జరిగిన బీజేపీ రాష్ట్ర సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన సందేశం కార్యకర్తల్లో స్ఫూర్తి నింపిందని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ర్ట కో కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒడిసెల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్, రాష్ట్ర నాయకులు పంతికే ప్రకాష్, బీజేవైఎం జిల్లా నాయకులు రచ్చ మల్లేష్, నాయకుడు ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు
నిర్మల్ అర్బన్ : టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే ఎంఐఎం పెట్రేగిపోతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూమయ్య, జిల్లా తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ రావుల రాంనాథ్ విమర్శించారు. దేశాన్ని నడిపించేది రాజ్యాంగమని, మతపరమైన పాలన సాగడం లేదని తెలిపారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. నిర్మల్‌లోని మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసేందుకు నిరాకరించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అజీం బిన్ యాహియా, ఖమ్మం జిల్లాలో జెండా వందనానికి నిరాకరించిన పాఠశాల హెచ్ఎం షరీఫ్‌లపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మాగాంధీని అగౌరవపర్చడం అంటే దేశ ప్రజలను అవమానించడమేనని, మున్సిపల్ వైస్ చైర్మన్ అజీం బిన్ యాహియాను బర్తరఫ్ చేయాలని అన్నారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్, ప్రధాన కార్యదర్శి నాయిడి మురళీ, అసెంబ్లీ కన్వీనర్ మెడిసెమ్మ రాజు, జిల్లా కార్యదర్శి పోశెట్టి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రచ్చ మల్లేష్, బీజేపీ నాయకులు హరివర్మ, ప్రేమ్‌కుమార్, రవి, శైలేష్, రాజే శ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాబ్లీ సమస్య
ఖానాపూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాబ్లీ ప్రాజెక్టు సమస్య ఉత్పన్నమైందని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ రావుల రాంనాథ్ విమర్శించారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై వివక్షతోనే సీఎం బాబ్లీ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించకపోవడంతోనే నేడు 14 గేట్లు మూసి వేశారన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర సర్కార్ ఆ ప్రాంత రైతుల కోసం పాటు పడిన విషయాన్ని చూసి మన పాలకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. కేవలం బాబ్లీ ప్రాజెక్టే కాకుండా దాని పైభాగంలో మరో 10కి పైగా అక్రమ కట్టడాలు చేపడుతూ మహారాష్ట్ర సర్కారు జలదోపిడీకి పాల్పడుతుందన్నారు. దీనిపై నిఘా ఉంచాల్సిన ప్రభుత్వం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో తెలంగాణలోని ఆరు జిల్లాలు సాగు, తాగు నీరు లేక ఎడారి కానున్నాయన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైకేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే బాబ్లీ సమస్య ప్రారంభమైందని, అందుకే కేసీఆర్ మాట్లాడడం లేదన్నారు. బాబ్లీ సమస్యపై ప్రధాని, రాష్ట్రపతి జోక్యం చేసుకుని సుప్రీంలో ప్రత్యేక పిటిషన్ వేసి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు. బాబ్లీపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పాకల రాంచందర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మేస సతీశ్, జిల్లా కార్యదర్శి పడాల రాజశేఖర్, నాయకులు వినోద్, ప్రభాకర్ గౌడ్, ఎనగందుల రవితేజ, పరిమి సత్యానంద్, వెంకటేశ్, రవిందర్, శేఖర్, ప్రసాద్ తదిరులు ఉన్నారు.