ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాబ్లీ ప్రాజెక్టు సమస్య ఉత్పన్నమైందని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ రావుల రాంనాథ్ విమర్శించారు.
ఖానాపూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాబ్లీ ప్రాజెక్టు సమస్య ఉత్పన్నమైందని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కోకన్వీనర్ రావుల రాంనాథ్ విమర్శించారు. మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై వివక్షతోనే సీఎం బాబ్లీ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరైన వాదనలు వినిపించకపోవడంతోనే నేడు 14 గేట్లు మూసి వేశారన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర సర్కార్ ఆ ప్రాంత రైతుల కోసం పాటు పడిన విషయాన్ని చూసి మన పాలకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. కేవలం బాబ్లీ ప్రాజెక్టే కాకుండా దాని పైభాగంలో మరో 10కి పైగా అక్రమ కట్టడాలు చేపడుతూ మహారాష్ట్ర సర్కారు జలదోపిడీకి పాల్పడుతుందన్నారు. దీనిపై నిఘా ఉంచాల్సిన ప్రభుత్వం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో తెలంగాణలోని ఆరు జిల్లాలు సాగు, తాగు నీరు లేక ఎడారి కానున్నాయన్నారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపైకేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే బాబ్లీ సమస్య ప్రారంభమైందని, అందుకే కేసీఆర్ మాట్లాడడం లేదన్నారు. బాబ్లీ సమస్యపై ప్రధాని, రాష్ట్రపతి జోక్యం చేసుకుని సుప్రీంలో ప్రత్యేక పిటిషన్ వేసి ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు. బాబ్లీపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి పాకల రాంచందర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మేస సతీశ్, జిల్లా కార్యదర్శి పడాల రాజశేఖర్, నాయకులు వినోద్, ప్రభాకర్ గౌడ్, ఎనగందుల రవితేజ, పరిమి సత్యానంద్, వెంకటేశ్, రవిందర్, శేఖర్, ప్రసాద్ తదిరులు ఉన్నారు.