రక్షణ మంత్రిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు | Sakshi
Sakshi News home page

రక్షణ మంత్రిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

Published Sat, Feb 2 2019 2:43 AM

TRS MPs to meet Defense Minister - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సచివాలయ నిర్మాణం, రహదారుల విస్తరణకు వీలుగా రక్షణ శాఖ పరిధిలోని బైసన్‌ పోలో భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అనంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘రక్షణ శాఖ భూముల బదలాయింపుపై ఇప్పటికే అనేక మార్లు ప్రధాని మోదీని కలిశాం. బైసన్‌పోలో స్థల వివాదం కేసు హైకోర్టులో ఉందని గతంలో ప్రధాని చెప్పారు. తాజాగా హైకోర్టు బైసన్‌ పోలో స్థలం కేంద్రానిదే అని స్పష్టతనిచ్చింది.

ఈ నేపథ్యంలో మరోసారి కేంద్ర మంత్రిని కలిసి ఈ అంశంపై చర్చిం చాం. బైసన్‌పోలో స్థలానికి బదులు స్థలం, కొంత శాతం పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించాం. మా విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’ అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్‌ రాసిన లేఖను కేంద్ర మంత్రికి ఎంపీ వినోద్‌కుమార్‌ అందజేశారు. రక్షణ మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు కవిత, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జోగినిపల్లి సంతోష్‌కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్‌ తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement