ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్? | trs likely to join nda government in centre | Sakshi
Sakshi News home page

ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్?

Jan 27 2015 10:41 AM | Updated on Sep 2 2017 8:21 PM

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే జోరుగా బీజేపీ కేంద్ర నాయకులతోను, రాష్ట్రస్థాయి నాయకులతోను చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే జోరుగా బీజేపీ కేంద్ర నాయకులతోను, రాష్ట్రస్థాయి నాయకులతోను చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఇక ఎన్డీయేలోకి టీఆర్ఎస్ చేరడం ఖాయమని అంటున్నారు. ఇదే జరిగితే, ఓ మహిళా ఎంపీతో పాటు మరొకరికి కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కావాలని కోరాలని భావిస్తున్నారు. భారీ ప్రాజెక్టులు, పథకాలకు నిధులు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లాంటి పథకాలకు దాదాపు రూ. 50 వేల కోట్ల వరకు నిధులు కావల్సి ఉండటం, ప్రత్యేక హోదా లేకపోవడం... ఇలాంటి కారణాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కూడా ఈ దిశగా ఆలోచించేందుకు కారణమయ్యాయని అంటున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ గనక ఎన్డీయేలో చేరితే.. జాతీయ స్థాయిలో ప్రభావంతో పాటు రాష్ట్రానికి కూడా ప్రయోజనం ఉంటుందని యోచిస్తున్నట్లు సమాచారం.

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రలో టీడీపీ ఇప్పటికే ఎన్డీయేలో ఉన్నందున.. వాళ్లకంటే తమకు నిధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటికే జోరుగా హస్తిన పర్యటనలు చేస్తున్నారు. మొదట్లో కొన్నాళ్ల పాటు మైనారిటీలను దృష్టిలో పెట్టుకుని కొంత ముందు వెనక ఆలోచించినా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంలో చేరితేనే మంచిదని భావిస్తున్నారు. అయితే, ఇదే తరుణంలో టీడీపీతో టీఆర్ఎస్కు ఇప్పటికి సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం, ఇటు తెలంగాణ బీజేపీ నేతలతో కూడా అంతగా సఖ్యత లేకపోవడం లాంటి కారణాల రీత్యా బీజేపీ ఎంతవరకు టీఆర్ఎస్ను దగ్గరకు చేర్చుకుంటుందన్నది మాత్రం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement