breaking news
trs bjp discussions
-
పొత్తులు... ఎత్తులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శాసనసభ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ పన్నిన రాజకీయ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీయేతర పక్షాలు ఏకమై మహాకూటమిగా పోటీ చేయాలనే యోచనతో కసరత్తు సాగిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే విషయాన్ని ఖరారు చేయనుండగా, జిల్లాల్లో ఏ పార్టీ ఏ నియోజకవర్గం నుంచి బరిలో నిలవనుందనే అంశాలపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీలు తమకు బలమున్న నియోజకవర్గాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశాయి. అయితే కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలు ఒక్కో సీటు నుంచి పోటీ చేయడమే గగనంగా మారిన పరిస్థితుల్లో బలమున్న సీట్లను కూడా స్క్రూటినీ చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పొత్తుల చర్చలు రాష్ట్ర స్థాయిలో జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఏయే సీట్లలో ఏ పార్టీ పోటీ చేస్తుందనే అంశం ఆసక్తి రేపుతోంది. మిత్ర పక్షాలకు రెండు లేదా మూడు.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషించనుంది. ఒకప్పుడు జిల్లాను శాసించిన తెలుగుదేశం ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక్కసీటు నుంచైనా పోటీ చేసి విజయం సాధించాలనే ఆలోచనతో ఉంది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ జిల్లా నుంచి పోటీ చేస్తారని భావించినా, మీమాంస నెలకొంది. వామపక్ష భావాలు అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలో సీపీఐ కూడా తప్పనిసరిగా ఓ సీటు నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉంది. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలోని పది సీట్లలో టికెట్ల కోసం కాంగ్రెస్ నేతల మధ్యనే తీవ్ర పోటీ నెలకొని ఉండడం గమనార్హం. మంచిర్యాల కోరుతున్న సీపీఐ... ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచిన సీపీఐ 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత కొత్తగా ఏర్పాటైన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరుపున మరోసారి విజయం సాధించింది. ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి సీపీఐ తరుపున పోటీ చేసి గెలిచిన నాయకుడు గుండా మల్లేష్ ఒక్కరే. 2014లో ఆయన దుర్గం చిన్నయ్య చేతిలో 50వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బెల్లంపల్లిలో పార్టీ బలహీనపడిందనే కారణంతో సీపీఐ ఈసారి మంచిర్యాల మీద కన్నేసింది. ఈ మేరకు పొత్తుల్లో భాగంగా పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల జాబితాను తయారు చేసిన సీపీఐ రాష్ట్ర కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాలను ఎంపిక చేసింది. మంచిర్యాల జిల్లా పార్టీ కార్యదర్శి కలవేన శంకర్‌ను అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థి నాయకుడి నుంచి జిల్లా కార్యదర్శిగా ఎదిగిన శంకర్ ఈసారి పార్టీ నుంచి పోటీ చేస్తానన్న ధీమాతో ఉన్నారు. కోదండరాం మంచిర్యాల కోరితే... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం జోగాపూర్‌కు చెందిన ఆయన వచ్చే ఎన్నికల్లో మంచి ర్యాల నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరిగిం ది. అయితే ఇక్కడ టీజేఎస్ పార్టీ అంతగా వేళ్లూనుకోకపోవడం, సంస్థాగతంగా నాయకులు, కార్యకర్తలు లేక బలహీనంగా ఉండడం వంటి కారణాలతో ఆయన జనగామ లేదా టీజేఏసీ బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకులే చెపుతున్నారు. అయితే సొంత జిల్లా కాబట్టి కోదండరాం ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తే మాత్రం కాంగ్రెస్, సీపీఐ కూడా వెనక్కు వెళ్లాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. బెల్లంపల్లిపై టీడీపీ పట్టు తెలుగుదేశం పార్టీలో వెలుగు వెలిగిన నాయకులంతా టీఆర్ఎస్ గూటికి చేరడంతో అనేక నియోజకవర్గాల్లో పేరున్న పార్టీ నాయకుడు లేకుండా పోయాడు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో కార్యకర్తలు తప్ప నాయకులు లేని పరిస్థితి ఉంది. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లోనే పార్టీ జెండాలు పట్టుకునే నాయకులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు పొడిస్తే... మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి సీటునుæ దక్కించుకోవాలని భావిస్తోం ది. జిల్లా పార్టీ అధ్యక్షుడు శరత్‌బాబు ఇక్కడి నుం చి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు. సిర్పూర్ సీటు కూడా పార్టీ కోరుతున్నప్పటికీ, కాంగ్రెస్ ఆ సీటును వదులుకొనేందుకు సిద్ధంగా లేదు. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఉండడంతో టీడీపీ ఆ సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తమ ప్రాధాన్యతా నియోజకవర్గాల జాబితాలో బెల్లంపల్లిని కూడా చేర్చినట్లు సమాచారం. మంచిర్యాలలో కాంగ్రెస్ పటిష్టం మంచిర్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒకవైపు సీపీఐ, మరోవైపు టీజేఎస్ దృష్టి పెట్టినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం వదులుకునేందు కు సిద్ధంగా లేదు. బలమైన యంత్రాంగం ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీకి రెండు దిగ్గజాలు సిద్ధంగా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి టికెట్టు రేసులో ఉన్నారు. కాగా ప్రేంసాగర్‌రావు ఇప్పటికే నియోజకవర్గంలో చీరల పంపిణీ, పేదలకు లబ్ధి చేకూర్చే పలు కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకు వెళుతున్నారు. ప్రేంసాగర్‌రావుతో పాటు అరవింద్‌రెడ్డి కూడా ఎవరికి వారే తమకు టికెట్టు ఖాయమన్న ధీమాతో ఉన్నారు. -
ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్?
-
ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్?
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ చేరే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే జోరుగా బీజేపీ కేంద్ర నాయకులతోను, రాష్ట్రస్థాయి నాయకులతోను చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. ఇక ఎన్డీయేలోకి టీఆర్ఎస్ చేరడం ఖాయమని అంటున్నారు. ఇదే జరిగితే, ఓ మహిళా ఎంపీతో పాటు మరొకరికి కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కావాలని కోరాలని భావిస్తున్నారు. భారీ ప్రాజెక్టులు, పథకాలకు నిధులు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లాంటి పథకాలకు దాదాపు రూ. 50 వేల కోట్ల వరకు నిధులు కావల్సి ఉండటం, ప్రత్యేక హోదా లేకపోవడం... ఇలాంటి కారణాలతో పాటు రాజకీయ ప్రయోజనాలు కూడా ఈ దిశగా ఆలోచించేందుకు కారణమయ్యాయని అంటున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ గనక ఎన్డీయేలో చేరితే.. జాతీయ స్థాయిలో ప్రభావంతో పాటు రాష్ట్రానికి కూడా ప్రయోజనం ఉంటుందని యోచిస్తున్నట్లు సమాచారం. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రలో టీడీపీ ఇప్పటికే ఎన్డీయేలో ఉన్నందున.. వాళ్లకంటే తమకు నిధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఇప్పటికే జోరుగా హస్తిన పర్యటనలు చేస్తున్నారు. మొదట్లో కొన్నాళ్ల పాటు మైనారిటీలను దృష్టిలో పెట్టుకుని కొంత ముందు వెనక ఆలోచించినా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంలో చేరితేనే మంచిదని భావిస్తున్నారు. అయితే, ఇదే తరుణంలో టీడీపీతో టీఆర్ఎస్కు ఇప్పటికి సంబంధాలు అంత గొప్పగా లేకపోవడం, ఇటు తెలంగాణ బీజేపీ నేతలతో కూడా అంతగా సఖ్యత లేకపోవడం లాంటి కారణాల రీత్యా బీజేపీ ఎంతవరకు టీఆర్ఎస్ను దగ్గరకు చేర్చుకుంటుందన్నది మాత్రం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది.