కప్పదాట్లు..!

TRS Leaders Join In Congress Party In Nizamabad - Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: నేతల వలసలతో జిల్లాలో రాజకీయ సమీకరణలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ నేతల కప్పదాట్లతో ఆయా నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు పార్టీలు మారుతుండటంతో ఆయా నియోజకవర్గాల్లో సమీకరణలు మారుతున్నాయి. ఇటీవల మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పగా, తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. భూపతిరెడ్డి కాంగ్రెస్‌లోకి రాకతో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఆశావహుల సంఖ్య మరింత పెరిగినట్లయింది. ఇప్పటికే ఇక్కడ నలుగురు నేతలు రూరల్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. పొత్తులో భాగంగా రూరల్‌ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం నెలకొంటే.. రూరల్‌ టికెట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చాకే భూపతిరెడ్డి పార్టీలో చేరినట్లు ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది.

మరోవైపు స్పీకర్‌ సురేశ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి రావడంతో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కూడా సమీకరణలు మారాయి. గత ఎన్నికల్లో సురేశ్‌రెడ్డి కాంగ్రెస్‌ తరపున ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈసారి ఆయన ఆర్మూర్‌ నుంచి గానీ, బాల్కొండ నుంచి గానీ పోటీ చేయాలనే ఊగిసలాటలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి, కారెక్కారు. దీంతో కాంగ్రెస్‌లో ఆర్మూర్‌ తెరపైకి కొత్త నేతల పేర్లు వచ్చాయి. ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ ఆకుల లలిత కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరుసగా రెండుసార్లు ఆర్మూర్‌లో ఓటమి పాలైన సురేశ్‌రెడ్డి ఈసారి ఎలాగైనా బాల్కొండ నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. దీంతో ఇక్కడి స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈరవత్రి అనిల్‌తో పాటు, సురేశ్‌రెడ్డి కూడా టికెట్‌ రేసులో ఉంటారని భావించారు. సురేశ్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రస్తుతానికి కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో అనిల్‌ ఒక్కరే మిగిలారు. కాగా పొత్తులో భాగంగా ఈ స్థానంపై టీడీపీ కన్నేసింది. ఇక్కడి నుంచి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. ఇలా నేతల కప్పదాట్లు మూడు నియోజకవర్గాల్లో ప్రభావం చూపుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top