గులాబీల గుండెల్లో గుబులు

TRS Leaders Join In Congress Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: రెండు నెలల క్రితం ముందస్తు ఎన్నికలకు సమర శంఖం పూరించినప్పుడే ఉమ్మడి జిల్లాలోని టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన వెలువడింది. టికెట్టు దక్కిన ఆనందంతోపాటే అసమ్మతి పోటు కూడా ఆ రోజు నుంచే మొదలైంది. రోజులు గడిచే కొద్దీ అదే సద్దుమణుగుతుందని భావించిన అభ్యర్థులకు సీన్‌ రివర్స్‌ అయింది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు తిరుగుబావుటాలు ఎగురవేశారు. పార్టీ టికెట్లు ఆశించి భంగపడ్డ రాథోడ్‌ రమేష్‌ కాంగ్రెస్‌ పంచన చేరి టికెట్టు కోసం ప్రయత్నిస్తుండగా, సిర్పూరులో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు. చెన్నూరులో సీటు కోల్పోయిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కోసం ఏకంగా ఆత్మాహుతే జరిగింది.

ఓదెలు తరువాత కేసీఆర్‌ హామీతో చల్లబడ్డా, ఇక్కడ మరో మాజీ ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు విఫలయత్నం చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన తరువాతే ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇదే నియోజకవర్గానికి చెందిన జెడ్‌పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. మిగతా నియోజకవర్గాలలో పార్టీలు మారకపోయినా... సొంతింట్లోనే కుంపటి పెడుతున్నారు.

మునిసిపాలిటీ పాలకవర్గాల షాక్‌
నిర్మల్‌ మునిసిపాలిటీ చైర్మన్‌ అప్పాల గణేష్‌ చక్రవర్తి కౌన్సిలర్లతో కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్‌లో చేరడంతో మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి తేరుకోలేని పరిస్థితి. నిర్మల్‌ నియోజకవర్గంలో మునిసిపాలిటీ ఓట్లే కీలకం కాగా, కౌన్సిలర్ల తోపాటు ఆయన కాంగ్రెస్‌  కండువా కప్పుకోవడం మింగుడుపడని అంశం. దీన్ని సరిచేసేందుకు మండలాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్పించే పనిలో ఆ పార్టీ నాయకులు పడ్డారు. బెల్లంపల్లి మునిసిపాలిటీలో చైర్‌పర్సన్‌తోపాటు సుమారు 20 మందికి పైగా కౌన్సిలర్లది అదే తీరు. వీరెవరూ పార్టీ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు ఏ మాత్రం సహకరించడం లేదు. వేమనపల్లి జెడ్‌పీటీసీతోపాటు పలువురు ఎంపీటీసీలు, నాయకులు టీఆర్‌ఎస్‌కు దూరంగానే ఉంటున్నారు.

ఇక్కడ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆయన మద్దతుదారులు కూడా దూరంగానే ఉంటున్నారు. మంచిర్యాల మునిసిపాలిటీ పాలక వర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎన్‌.దివాకర్‌రావుకు ఎలాంటి సహకారం లభించడం లేదు. ఇటీవల పాత మంచిర్యాలలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి మాజీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వసుంధరతోపాటు పలువురు కౌన్సిలర్లు కూడా దూరదూరంగానే ఉంటున్నారు. మంచిర్యాల ఎంపీపీ బేర సత్యనారాయణ ఏకంగా బీఎస్‌పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగజ్‌నగర్‌ మునిసిపాలిటీలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

చెన్నూరులో  దూరదూరంగా నాయకులు
పెద్దపల్లి ఎంపీ, చెన్నూరు శాసనసభ అభ్యర్థి బాల్క సుమన్‌ గ్రామ గ్రామాన ప్రచారం సాగిస్తున్నప్పటికీ, పార్టీ నాయకుల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. కోటపల్లి, చెన్నూరు మండలాలల్లో ప్రభావం చూపగల జెడ్‌పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, ఆయన మద్దతుదారులు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. వీరంతా దీపావళి తరువాత కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఇక్కడ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌ను నమ్ముకున్నా, పాత తరం నాయకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మందమర్రిలో తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఎఫెక్ట్‌ కనిపిస్తోంది. మండలాల్లో బూత్‌ల వారీగా పార్టీ నాయకులకు బాధ్యతలను అప్పగించడం లేదని చాలా మంది దూరంగా ఉంటున్నారు. కేవలం యూత్‌ను నమ్ముకొనే రాజకీయం చేస్తామంటే చెన్నూరులో సాధ్యం కాదని ఆయన వెంట ఉండే నాయకులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.

బోథ్‌లో బాపూరావుకు నగేష్‌ తలనొప్పి
బోథ్‌ సీటు ఆశించి భంగపడ్డ ఆదిలాబాద్‌ ఎంపీ నగేష్‌ ఇక్కడ అభ్యర్థి బాపూరావుకు ఏమాత్రం సహకరించడం లేదు. బాపూరావుతోపాటు ఇప్పటి వరకు ఎక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ఇటీవల ఆదిలాబాద్‌లో మంత్రి జోగు రామన్న వెంట పర్యటించిన నగేష్‌ సొంత నియోజకవర్గం బోథ్‌లో దూరంగా ఉంటున్నారు. ఆయనతోపాటు మద్దతుదారులెవరూ బాపూరావు వెంట నడవడం లేదు. ముథోల్‌లో కూడా మాజీ ఎమ్మెల్యే సముద్రాల వేణుగోపాలాచారి మద్దతుదారులు విఠల్‌రెడ్డికి సహకారం అందించడం లేదు.

ఆసిఫాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవలక్ష్మికి కూడా అసమ్మతి వెంటాడుతోంది. ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అ«భ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏకపక్షంగా ఉంటుందని భావించిన ఎన్నికలు హోరాహోరీగా మారిపోతున్న తరుణంలో సొంతపార్టీలోని కుంపట్లు పుట్టిముంచుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారైతే అసంతృప్తి వాదులను పార్టీలోకి లాక్కోవాలనే ఆలోచనతో కొందరు నాయకులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top