‘జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది’

TRS Govt commited to resolve Journalists Problems says KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ జర్నలిస్టులకు పెద్దపీట వేసి సంస్థాగతంగా గౌరవించిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. జర్నలిస్టు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని కేటీఆర్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఓ సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామన్నారు. కోర్టు వివాదాలు లేకుండా ఇళ్ల స్థలాలు, హెల్త్‌కార్డుల పంపిణీకి చిత్తశుద్ధితో ముందుకు పోతున్నామన్నారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల భవనానికి స్థలం కేటాయించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడివి ఆపద మొక్కులు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మన పథకాలను ఏపీ సీఎం చంద్రబాబు కాపీకొడుతున్నారన్నారు. కేసీఆర్ ఏం చేస్తే, అవి చేస్తే తాను కూడా గెలుస్తానని చంద్రబాబు అనుకుంటున్నాడని, చిత్తశుద్ది లేని శివపూజలు చేస్తే ఏం ఒరిగేది లేదన్నారు. ఆంధ్రా ప్రజలు, అక్కడి జర్నలిస్టులు తెలివైన వాళ్లు. చైతన్యవంతులు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కారం చేసిందని, మరి కోన్ని‌ సమస్యలు ఇంకా పరిష్కరించాల్సి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం జర్నలిస్టులకు100కోట్ల నిధి ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మన సమస్యలు తెలుసని, ఇవాళ  కేటీఆర్ మనతో ఉన్నారు కాబట్టి మనకు ఒక భరోసా ఉందని తెలిపారు. సాధ్యమైనంత వరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top