మా దారి మాదే..!

TRS And Congress Party Leaders Join Other Parties Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గతంలో బంగారు తెలంగాణ నిర్మాణం పేరుతో విపక్ష పార్టీలకు చెందిన నేతలందరూ భారీ గా టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే, నాలుగున్నర ఏళ్ల పాలనలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమ పట్ల చూపిన వివక్ష, ప్రాధాన్యత తగ్గింపు తదితర కారణాలతో లోలోన రగిలిపోయా రు. తాజాగా మళ్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో వారే పోటీకి దిగుతుండడంతో అసంతృప్త నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పలువురు అభ్యర్థుల విషయంలో స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. వారి మార్పుపై  అధిష్టానం ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో తమ దారి తమదే అంటూ ద్వితీయశ్రేణి నేతలు, ముఖ్యనేతలుగా చెలామణి అయిన జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోతున్నారు. ఎన్నికల వేళ ఇలా జరుగుతుండడం టీఆర్‌ఎస్‌లోని పలువురు ముఖ్యనేతలకు మింగుడు పడడం లేదు.
 
ఆపరేషన్‌ ఆకర్షన 
ఉమ్మడి పాలమూరు జిల్లాలో విపక్ష పార్టీలను బలహీనం చేసేందుకు టీఆర్‌ఎస్‌ గట్టి ప్రయత్నాలు చేసింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానాన్ని గెలుచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ సునామీ సృష్టించినా.. పాలమూరులో ఆశించినంతగా ఫలితం దక్కలేదు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆపరేషన్‌ ఆకర్షనకు శ్రీకారం చుట్టింది. రాజకీయ పునరేకీరణ నేపథ్యంలో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలుపొందిన ఎస్‌.రాజేందర్‌రెడ్డితో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అనంతరం ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గంలోని విపక్ష పార్టీలకు చెందిన నేతలకు విపరీతంగా గాలం వేశారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లందరినీ పార్టీలోకి చేర్చుకుని గులాబీ కండువాలు కప్పారు.
 
పార్టీలకు గుడ్‌బై 

ఆపరేషన్‌ ఆకర్షన దాటికి పార్టీలో చేరిన నేతలకు అనధికాలంలోనే నిరుత్సాహానికి గురయ్యారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పనులు, ప్రాధాన్యత దక్కకపోవడంతో నియోజకవర్గాల్లో అసమ్మతి రాజేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. తాజాగా రాబోయే ఎన్నికల్లో కూడా సిట్టింగ్‌లనే అభ్యర్థులుగా ప్రకటించడం అసంతృప్తుల కడుపు మంటకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే తమ దారి చూసుకొని పార్టీల కండువాలు మార్చేస్తున్నారు.

  • నారాయణపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి అతి స్వల్ప తేడాతో ఓటమి పాలైన కుంభం శివకుమార్‌.. పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని ముఖ్యనేతలు చాలా వరకు శివకుమార్‌తో పాటు పార్టీ మారారు. అంతేకాదు గతంలో ఈ నియోజకవర్గంలో అసంతృప్త నేతలు ఏకంగా మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాస్‌.. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై తిరుగుబాటు చేసి సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఇలా అసంతృప్తనేతలందరూ ఎవరికి వారు తమ దారి చూసుకుంటున్నారు. 
  • అచ్చంపేట నియోజకవర్గంలో కూడా అసమ్మతి వర్గం పార్టీని వీడుతోంది. తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పట్ల కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో భాగంగా పలువురు స్వయంగా మంత్రి కేటీఆర్‌ను కలిసి బాలరాజుపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినా మంత్రి కేటీఆర్‌ మాత్రం అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేదని... అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దీంతో చేసేదేం వంగూరు ఎంపీటీసీ భాగ్యలక్ష్మీ శ్రీనివాస్, అనుచరులు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే లింగాల మండలానికి చెందిన శ్రీనివాసరావుకు కూడా ఇటీవల కాలంలో గువ్వలతో బెడిసికొట్టడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
  •  దేవరకద్ర నియోజకవర్గంలో కూడా అసెంబ్లీని రద్దు చేసిన మరుసటి రోజే ఒక జెడ్పీటీసీ, ఎంపీపీ పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలోని జెడ్పీటీసీ లక్ష్మీ, ఎంపీపీ క్రాంతి ఆంజనేయులు పార్టీలో తమకు ప్రాధాన్యం ఉండడం లేదని ఒక బహిరంగ లేఖ రాసి పార్టీ వీడి వెళ్లిపోయారు.
  • అసంతృప్తి సెగలు ఎమ్మెల్యేలకే కాదు.. మంత్రులకు సైతం తగులుతున్నాయి. జిల్లాలో కీలక మంత్రిగా ఉంటూ గత 20 ఏళ్లుగా నిరంతరంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావుకు సైతం అసమ్మతి సెగలు తగులుతున్నాయి. కొద్ది కాలం క్రితం వీపనగండ్ల మండలానికి చెందిన ఎత్తం కృష్ణ, బాలస్వామి వంటి నేతలు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన రాజేశ్‌ సైతం కాంగ్రెస్‌లో చేరారు. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచే అభ్యర్థి విషయంలో స్పష్టత వస్తే సమీకరణాలలో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.
  •  జిల్లాకు చెందిన మరో మంత్రి డా.సి.లక్ష్మారెడ్డికి సైతం చేదు అనుభవాలే ఎదురయ్యాయి. పర్వతాపూర్‌ మైసమ్మ ఆలయ మాజీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీతో విభేదించి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అలాగే బాలానగర్‌ మండలానికి చెందిన హరిచందర్‌ పాటు నియోజకవర్గంలో చోటామోటా నాయకులు సైతం పార్టీని వీడి ఇతర పార్టీలో చేరారు.
  • మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని హన్వాడ మండల జెడ్పీటీసీ సభ్యుడు ఎం.నారాయణమ్మ ఆమె కుమారుడు సురేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేసినా... అనంతరం తమ పట్ల వివక్ష చూపారనే కారణంతో కొంత కాలం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేసి... తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.
  • ఆశలకు గండి 

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు నుంచి దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేయాలని భావిస్తున్న టీఆర్‌ఎస్‌కు కొంత కాలంగా పార్టీలో చేసుకుంటున్న పరిణామాలు అసంతృప్తికి గురిచేస్తున్నాయి. పాలమూరులో మెజారిటీ స్థానాలను చేజిక్కించుకోవాలనే ఆలోచనతో ఉమ్మడి జిల్లా పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించారు. పెండింగ్‌ ప్రాజెక్టులను కొలిక్కి తీసుకురావడంతో కీలకమైన అంశాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఈ నేపథ్యంలో అత్యధిక స్థానాలు సాధించాలనే పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్‌ ఆశలకు గండిపడుతున్నాయి. ఆధిపత్యపోరు, అసంతృప్తి తదితర కారణాల చేత ద్వితీయశ్రేణి నేతలు పార్టీలను వీడుతున్నారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top