ఉద్యోగుల రవాణా

Transport Department Transfers In Warangal - Sakshi

కార్యాలయం, చెక్‌పోస్టు.. రెండు, మూడు చోట్ల పోస్టింగ్‌లు

అన్ని విభాగాల ఉద్యోగుల చూపు ‘ఆన్‌ డిప్యూటేషన్‌’ వైపే.. 

సాక్షి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా రవాణా శాఖ ప్రత్యేకతలు చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి ఆరు జిల్లాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉప రవాణా కమిషనర్‌పై ఉంది. అయితే, రవాణా శాఖ ఉన్నతాధికారుల తీరుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు నచ్చితే చాలు... ఆ ఉద్యోగి కోరుకున్న చోటకు అంతర్గత, అనధికారికంగా బదిలీ చేయడమే కాదు, దానినే శాశ్వత బదిలీల్లో చూపిస్తున్నారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా ఇదే తంతు కొనసాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతా తాత్కాలికమే
ఉమ్మడి వరంగల్‌ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాల ఆర్‌టీఓ కార్యాలయాల్లో చిన్నస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ తాత్కాలిక విధులే నిర్వహిస్తున్నారు. పలువురు ఉన్నతాధికారులు హైదరాబాద్‌ స్థాయిలో నేతలను ప్రసన్నం చేసుకుని... రెండు, మూడు పోస్టుల్లో కూడా కొనసాగుతుండడం గమనార్హం. కొందరైతే ఉమ్మడి వరంగల్‌ కేంద్రంగా అనధికారికంగా చెక్‌పోస్టుకు విధులు కేటాయించుకుని ఇక్కడి నుంచే వేతనాలు తీసుకుంటున్నారు. ఇలా ఇష్టారీతిన ఎవరికి వారు వెళ్తుండడం..ఉన్నతాధికారులు కూడా బదిలీలు చేయడంతో కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక వివిధ పనులపై రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఖాళీల పేరిటే ఓడీ వ్యవహారం
రవాణాశాఖలో 2013 సంవత్సరం తర్వాత పదోన్నతులు లేవు. కానిస్టేబుళ్లు, క్లర్క్‌లు, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల నుంచి మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ల వరకు పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో కొందరు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ‘ఖాళీల’ పేరిట వ్యవహారానికి తెర తీశారు. ఎంవీఐల నుంచి డీటీఓ/ఆర్‌టీఓల పదోన్నతుల్లో జాప్యం జరిగినా.. మూడు నెలల కిందట హఠాత్తుగా ఐదుగురు జిల్లా రవాణాశాఖ అధికారు(డీటీఓ)లకు ఉప కమిషనర్‌(డీటీసీ)లుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే క్లర్క్‌లు, కానిస్టేబుళ్ల నుంచి ఏఎంవీఐలుగా ప్రమోషన్లు పొందాల్సిన వారి ఫైలు మాత్రం ఆరేళ్లుగా ముందుకు కదలడం లేదు.

రెండు, మూడు చోట్ల బాధ్యతలు
రవాణాశాఖలో పదోన్నతులు, హోదాలతో పని లేకుండా పలువురు ఎంవీఐలు ఇన్‌చార్జ్‌ డీటీఓలు, డీటీసీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇవీ చాలదన్నట్లు పొరుగు జిల్లాల బాధ్యతల కోసం హైదరాబాద్‌ స్థాయిలో పైరవీలు కూడా సాగిస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ రెగ్యులర్‌ ఎంవీవై రమేష్‌రాథోడ్‌ జనగామ ఇన్‌చార్జ్‌ ఎంవీఐ, డీటీఓగా మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్‌ పోస్టులో ఉన్న పి.రవీందర్‌ ఇన్‌చార్జ్‌ డీటీఓతో పాటు ఖమ్మం ఇన్‌చార్జ్‌ ఎంవీఐగా కూడా బాధ్యతల్లో ఉన్నారు. అలాగే మహబూబాబాద్‌ రెగ్యులర్‌ ఎంవీఐగా ఉన్న భద్రునాయక్‌ అక్కడే ఇన్‌చార్జ్‌ డీటీఓగా, ఖమ్మం ఇన్‌చార్జ్‌ డీటీఓగా వ్యవహరిస్తున్నారు.

వరంగల్‌ డీటీఓ కార్యాలయంలో ఎంవీఐగా పని చేస్తున్న కె.వేణు నెల కిందటి వరకు ఇన్‌చార్జ్‌ డీటీవో, డీటీసీగా వ్యవహరించారు. ఇటీవలే పదోన్నతిపై పురుషోత్తం డీటీసీగా విధుల్లో చేరగా, వేణు ఎంవీఐ, ఇన్‌చార్జ్‌ డీటీఓగా కొనసాగుతున్నారు. అదే విధంగా క్లర్క్‌లు, సూపరింటెండెంట్‌ తదితర పోస్టుల్లోని ఉద్యోగులు కూడా పలువురు రెండు, మూడు చోట్ల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆన్‌ డిప్యూటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా పరిమితికి మించిన పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారంటూ ఆ శాఖలో కొందరు రవాణాశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు తాజాగా నాలుగు రోజుల కిందట ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఫిర్యాదుతోనైనా మంత్రి, ఉన్నతాధికారులు స్పందిస్తారేమో వేచి చూడాలి.

డీపీసీ వేయాలన్న ప్రభుత్వం
శాఖలోని కొందరు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతల విజ్ఞాపన మేరకు పదోన్నతుల రవాణాశాఖలో డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) వేయాలని 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ప్రక్రియ మొదలైనట్లే కనిపించినా అనేక కారణాలతో ఇప్పటి వరకు జరగలేదు. ఫలితంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోగా రవాణాశాఖలో ఖాళీల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలను బుట్టదాఖలు చేసిన పలువురు పెద్ద ఎత్తున ‘రేటు’ ఫిక్స్‌ చేసి మరీ ఆన్‌ డిప్యూటేషన్లను సాగిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రెండు, మూడు పదవుల్లో కొనసాగుతున్న పలువురు ఉద్యోగులు వివాదాల నుంచి తప్పుకునేందుకు బదిలీల కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తాజా సమాచారం.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top