ప్రచార ర్యాలీలు.. ప్రజలకూ అగచాట్లు

Traffic lock..Public loss Due To Election Campaign Warangal - Sakshi

కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ..

ప్రధాన రహదారులన్నీజనంతోనే 

తలెత్తిన ట్రాఫిక్‌ సమస్య.. చేతులెత్తేసిన పోలీసులు

గంటపాటు ట్రాఫిక్‌ సమస్యతో ఇబ్బందిపడ్డ సామాన్య ప్రజలు

సాక్షి, మహబూబాబాద్‌ /మహబూబాబాద్‌ : నామినేషన్లు వేసేందుకు సోమవారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ బలాలను ప్రదర్శించేందుకు భారీగా ర్యాలీలతో తరలివచ్చి నామినేషన్లు వేశారు. దీంతో ప్రధాన రహదారులన్నీ జనంతో నిండగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. పోలీసులు సైతం చేతులెత్తేయడంతో గంటపాటు రాకపోకలు స్తంభించి సామాన్య జనం ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో రిట ర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.

మూడు రహదారులకు కొంత దూరం మేరకు భారీకేడ్లు, ఇతరత్రా స్టాండ్‌లు, ట్రాఫిక్‌ సంబంధించిన వాటితో ఆ దారులను మూసి వేశారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అభ్యర్థులు వారిని బలపరిచిన వారు మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మిగిలిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సోమవారం ఒకేసారి నామినేషన్‌ వేయడంతో ఆ ప్రాంతమంతా నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసింది. దానికి తోడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, నాయకులు భరత్‌చందర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథితో పాటు మరికొంత మందితో కలిసి ఉదయం 10.40 గంటలకు చేరుకుని 11 గంటలకు నామినేషన్ల స్వీకరించడం ప్రారంభం కాగానే నామినేషన్‌ వేసి వెళ్లారు. 

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ...
జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్‌ నుంచి వేలాది మందితో మహాకూటమి తరుపున భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ర్యాలీలో అభ్యర్థి బలరాంనాయక్‌తో పాటు మహాకూటమి నాయకులు భరత్‌చందర్‌రెడ్డి, వేంనరేందర్‌రెడ్డి, బి. విజయసారథి, డాక్టర్‌ డోలి సత్యనారాయణ, బండి పుల్లయ్య, గుగులోత్‌ సుచిత్ర, జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, బి. అజయ్‌ తదితరులు ప్రచార వాహనంలో ర్యాలీతో పాటు వచ్చారు. మూడు కొట్ల నుంచి శ్రీనివాస థియేటర్‌ వరకు ఆ దారంతా వారితో కిక్కిరిసింది. దీంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నామినేషన్‌ వేసిన అనంతరం బలరాంనాయక్‌ మాట్లాడుతూ మానుకోట కాంగ్రెస్‌కు కంచుకోట అని కాంగ్రెస్‌ గెలుపు తథ్యమన్నారు.

ట్రాఫిక్‌ సమస్య.. పోలీసులతో వాగ్వాదం
కాంగ్రెస్‌ ర్యాలీతో ముత్యాలమ్మ గుడి వద్ద ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.  దానిలో ఆర్టీసీ బస్సులతో పాటు పలు ప్రైవేట్‌ వాహనాలు నిలిచిపోయాయి. దారులన్నీ మూసుకుపోయాయి. కాంగ్రెస్‌ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి వెళ్లే విధంగా అనుమతి ఇవ్వాలని లేకపోతే ట్రాఫిక్‌ క్లియర్‌ చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  ఓ కాంగ్రెస్‌ కార్యకర్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది.  చివరికి కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు వేం నరేందర్‌రెడ్డి సమయం లేదని కార్యకర్తలు సమన్వయం పాటించాలని మాట్లాడడంతో సమస్య సర్ధుమనిగింది. కాంగ్రెస్‌ నాయకుడు రావుల రవిచందర్‌రెడ్డి ట్రాఫిక్‌ క్లియర్‌ చేసే బాధ్యత మీపై లేదా అని సీఐ రవికుమార్‌తో మాట్లాడారు.....దానికి వారు సిబ్బంది తక్కువగా ఉన్నారని సమాధానమిచ్చారు. దాంతో చేసేదేమీ లేక మహాకూటమి నాయకులు ఆ ర్యాలీలోనే మాట్లాడి ర్యాలీని ముగించుకోవాల్సి వచ్చింది.  

బీజేపీ భారీ ర్యాలీ...
బీజేపీ అభ్యర్థి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌ స్టేడియం నుంచి ఇందిరాగాంధీ సెంటర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్రచార రథంపైన అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. అనంతరం హుస్సేన్‌నాయక్‌ తన అనుచరులైన కిరణ్, చెలుపూరి వెంకన్న, యాప సీతయ్య, ముళ్లంగి ప్రతాప్, వెంకటలక్ష్మీతో కలిసి నామినేషన్‌ వేశారు. 

ఒకే సమయంలో రెండు ర్యాలీలతో...
కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకే సమయంలో ర్యాలీగా రావడంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. కొంత ముందుగా బీజేపీ ర్యాలీ ఇందిరాగాంధీ సెంటర్‌కు చేరుకున్నా ఆ తరువాత ర్యాలీ నుంచి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ కూడా తొర్రూరు రోడ్‌ నుంచి రావడంతో వేలాది మందితో రహదారులన్నీ కిక్కిరిశాయి. పాలకుర్తిలో కేసీఆర్‌ సభ ఉండడంతో సిబ్బంది ఎక్కువ అక్కడికి బందోబస్తుకు వెళ్లడంతో సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల సమస్య తలెత్తింది. ఏది ఏమైనా ర్యాలీతో మానుకోట హోరెత్తింది. ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. 

రిటర్నింగ్‌ ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట జన సందోహం
బందోబస్తు ఏర్పాటు చేయడం విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. నామినేషన్‌ చివరిరోజు కావడంతో పాటు ర్యాలీలు ఉన్నాయని ముందే తెలిసినా ఏర్పాటు చేయడంలో విఫలం కావడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రిటర్నింగ్‌ ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట మూడు రహదారుల్లో భారీ కేడ్లు, ఇతరత్రా స్టాండ్‌లు, ట్రాఫిక్‌ వాటితో మూసి వేశారు. అభ్యర్థులతో కేవలం బలపరిచిన వాళ్లే రావాల్సి ఉండగా మిగిలిన కొంతమంది కూడా కార్యాలయం ఎదుట రావడంతో ఆ ప్రాంతం జనసందోహంగా మారింది. భారీ కేడ్లు ఏర్పాటు చేసిన దగ్గరనే రానివ్వకుండా కట్టడి చేస్తే బాగుండేదని పోలీసులు వారిని అడ్డుకుని ఆపడంలో విఫలం కావడం జరిగింది. డీఎస్పీ ఆంగోత్‌ నరేష్‌కుమార్‌ నేరుగా లాఠీతో జనాన్ని బయటకు పంపినప్పటికీ మళ్లీ ఇతరులు రావడంతో కట్టడి చేయడం కష్టమైంది. దానికి తోడు ర్యాలీల సందర్భంగా ట్రాఫిక్‌ జాం కావడంతో కార్యకర్తలు కార్యాలయం వైపుకు చొచ్చుకుకెళ్లే ప్రయత్నం చేశారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top