‘కికిఛాలెంజ్‌’తో జైలుకే!

Traffic Chief Anil Kumar Warning To Kiki Challenges - Sakshi

ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌ వెల్లడి

సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల సోషల్‌మీడియా ద్వారా ప్రాచుర్యం పొందిన... రహదారులపై స్టంట్స్‌కు సంబంధించిన ‘కికిఛాలెంజ్‌’ విధానాలకు స్వస్తి చెప్పాలని నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ అన్నారు.  ఈ తరహా ఫీట్లు చేసిన వారిని పట్టుకుని కటకటాల్లోకి పంపుతామని హెచ్చరించారు. అనేక మంది వాహనచోదకులు నడుస్తున్న తేలికపాటి వాహనాల్లోంచి స్టీరింగ్‌ వదిలిపెట్టి బయటకు దూకడం, నడిరోడ్డుపై నృత్యాలు వంటి వీడియోలు ఇటీవల సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

యువతులు సైతం అలా చేస్తూ వీడియోలు షూట్‌ చేసి పోస్ట్‌ చేస్తున్నారు. ఇదే తరహా విన్యాసాలు సిటీలోనూ జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఫీట్లు చేసే వారిలో ప్రధానంగా యువతే ఎక్కువగా ఉంటున్నారని, ఇలాంటి చర్యల కారణంగా తమతో పాటు ఎదుటి వారి ప్రాణాలకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువతను దృష్టిలో పెట్టుకుని ఈ ‘కికిఛాలెంజ్‌’ విధానాలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ ధోరణిని వీడాలని, ఎవరైనా ఫీట్లు చేస్తూ చిక్కితే వారిపై ఐపీసీతో పాటు సిటీ పోలీసు యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top