రైతు ఆత్మహత్యలు పట్టని సర్కార్ | TPCC Chief Uttam Kumar Reddy Fire on TRS Government | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలు పట్టని సర్కార్

Sep 26 2015 11:31 PM | Updated on Sep 5 2018 9:45 PM

రాష్ట్రంలో రోజు రోజుకు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని తెలంగాణ పీససీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 మిర్యాలగూడ: రాష్ట్రంలో రోజు రోజుకు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని తెలంగాణ పీససీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మిర్యాలగూడలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలపై రాష్ర్ట మంత్రులు, అధికారులు కనీసం మానవీయ కోణంలో కూడా ఆలోచించడం లేదన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడితే.. మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా నోరుపారేసుకొని ఎదురు దాడికి దిగుతున్నారన్నారు. రాష్ర్ట ప్రజలు తెలివైన వారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పని తీరును గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కొంతమంది, అప్పుల బాధతో మరి కొంతమంది మొత్తం రాష్ట్రంలో 1,300 మంది ఆత్మహత్యలకు పాల్పడితే కనీసం ప్రభుత్వం వారికి భరోసా కూడా కల్పించడం లేదని విమర్శించారు.
 
 ఎంత సేపూ హైదరాబాదేనా?
 హైదరాబాద్ నగరాన్ని సింగపూర్, డల్లాస్ మాదిరిగా మారుస్తానని ప్రకటనలు చేస్తున్న సీఎం కేసీఆర్ రైతుల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు అందజేసే ప్యాకేజీని కూడా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు రూ.6 లక్షలు పెంచినట్టు ఆయన గుర్తుచేశారు. ఈ ప్యాకేజీని తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి చనిపోయిన వారికి అందించాలని డిమాండ్ చేశారు.
 
 ఇళ్ల బిల్లులు చెల్లించాలి..
 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని చెబుతూ ఇళ్లు నిర్మించుకున్న వారికి బిల్లులు మంజూరు చేయడం లేదని ఉత్తమ్ అన్నారు. గృహ నిర్మాణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొని బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, మిర్యాలగూడ ఎమెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరునగరు నాగలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తిరునగరు భార్గవ్, జెడ్పీటీసీ నాగలక్ష్మి, మిర్యాలగూడ, దామరచర్ల మండలాల పార్టీ అధ్యక్షులు భిక్షంగౌడ్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 రుణ మాఫీ  ఒకే దఫా ఇవ్వాల్సింది...
  రుణమాఫీ నాలుగు దఫాలు కాకుండా ఒకేసారి చేస్తే ఆత్మహత్యలు జరిగేవి కావని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కోట్లాది రూపాయలు వృథా చేస్తున్న సీఎం.. రుణమాఫీని ఒకే విడతలో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో రుణ మాఫీ ఒకే విడత చేయడంతోపాటు రుణమాఫీ కాని వారికి కూడా ప్రధాన మంత్రి ప్యాకేజీ అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే విషయమై అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement