
మొయినాబాద్(చేవెళ్ల): చిలుకూరు బాలాజీ దేవాలయంలో ఆదివారం అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని శివాలయంలోకి కూర్మం(తాబేలు) ప్రవేశించింది. ఇది కోవిడ్–19ని జయించడానికి శుభసూచికంగా భావిస్తున్నామని ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ పేర్కొన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రాంగణంలో ఉన్న సుందరేశ్వరస్వామి ఆలయం(శివాలయం)లోకి ఆదివారం తెల్లవారు జామున తాబేలు వచ్చింది.
అర్చకుడు సురేష్ ఆత్మారాం ఆలయం తలుపు తెరిచేసరికి శివలింగం పక్కన తాబేలు ఉండడాన్ని గమనించారు. ఈ విషయాన్ని అర్చకుడు రంగరాజన్‌కు తెలియజేయడంతో ఆయన వచ్చి పరిశీలించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి స్వామివారితోపాటు కురుమూర్తి(తాబేలు)కి సైతం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు రంగరాజన్ మాట్లాడుతూ.. చిలుకూరు బాలాజీ సన్నిధిలోని శివాలయంలోకి కురుమూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుందన్నారు. వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో త్వరలో కరోనా వైరస్‌ను అంతంచేసే అమృతం లభిస్తుందని సూచిస్తున్నట్లుగా ఉందని చెప్పారు.