ఆదివాసీల భూములు లాక్కుని తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తారా అని మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క ప్రశ్నించారు.
కొత్తగూడ: ఆదివాసీల భూములు లాక్కుని తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తారా అని మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క ప్రశ్నించారు. ఆదివారం గాంధీనగర్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యవసాయం అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుని కొంత ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులేస్తున్న ఏజెన్సీ ప్రజలను హరితహారం పేరుతో మరో 60 ఏళ్లు వెనక్కి నెడుతున్నారన్నారు. ఎన్నడూ లేని విధగా ఫారెస్ట్ అధికారులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రాజెక్టుల పేరుతో, మల్టీ నేషనల్ కంపనీలకు దారాదత్తం చేస్తున్న వేల ఎకరాల్లో అడవి నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి ఫాంహౌస్ వరకు పూర్తిగా మైదానమైన భూముల్లో అడవులను పెంచాలని సూచిం చారు.
పోడు భూములను సాగుచేసుకుంటున్న పేదలకు పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరారు. చేపలు పట్టేవారిపై ఫారెస్ట్ అధికారులు కేసులు పెట్టడం వేధింపులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఫారెస్ట్ దాడులు ఆపకపోతే ప్రజల తరపున టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. టీడీపీ మండల అధ్యక్షుడు కందిమల్ల మధుసూదన్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ తిరుపతి, ఓటాయి ఎంపీటీసీ సభ్యుడు బానోతు రూప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.