స్పేస్‌ సరిపోక సరిహద్దు దాటి..

Tigers Move Towards the Telangana Tiger Reserve from Maharashtra Tiger Reserve - Sakshi

కవ్వాల్‌లో పులుల కదలికలు!

మహారాష్ట్ర టైగర్‌ రిజర్వు నుంచి తెలంగాణ టైగర్‌ రిజర్వు వైపు..

అక్కడ పులుల సంఖ్య పెరగడం.. విస్తీర్ణం సరిపోకనే.. 

ఆదిలాబాద్‌ శివారులో పులి ప్రత్యక్షం.. ఆందోళనలో ప్రజలు 

సాక్షి, ఆదిలాబాద్‌:  ఆదిలాబాద్‌ శివారు మండలాల్లో పులుల సంచారం భయాందోళనకు గురిచేస్తున్నా యి. తాంసి, భీంపూర్‌ మండలాల్లో ఇటీవల ఆవు లపై దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. తాము పులిని చూశామని కొందరు చెబుతున్నా.. వాటికి సరైన ఆధారాలు దొరకలేదు. పులులు సంచరిస్తున్నాయని అటవీ శాఖాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. పులి విషయంలో ఏదైనా మాట్లాడితే అటు పులులకు సురక్షితం కాదని, ప్రజలు భయాందోళనలకు గురవడంతోపాటు వాటిని చంపే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయంతోనే అధికారులు వివరాలు వెల్లడించట్లేదు.  

ఆదిలాబాద్‌ నుంచి 18 కి.మీ దూరంలో మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ మీదుగా నాగపూర్‌ వెళ్లేందుకు 44వ జాతీయ రహదారికి ఇదే ప్రధాన మార్గం. పెన్‌ గంగ నదీ ప్రాంతమే తెలంగాణ, మహారాష్ట్రలకు సరిహద్దు. మహారాష్ట్ర వైపు యావత్మాల్‌ జిల్లా పాండర్‌కౌడ తాలూకా సమీపంలో తిప్పేశ్వర్‌ పులుల అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యం విస్తీర్ణా నికి మించి పులుల సంఖ్య పెరి గిందని అటవీ అధికారులు అంటున్నారు. దీంతో అక్కడున్న పులులు వేరే ప్రాంతాలకు కదులుతున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం పెన్‌గంగాలో అంతగా నీటి ప్రవాహం లేదు. తిప్పేశ్వర్‌ నుంచి కదులుతున్న పులులు.. పెన్‌గంగా దాటుకుని ఆదిలాబాద్‌ జిల్లా మీదుగా వెళ్తుం డటంతోనే పులుల సంచారంపై కొన్ని మండలాల్లోని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆవాసాలు, పంట పొలాలు, రోడ్లు దాటుకుని వెళ్తున్నప్పుడు ప్రజల కంట పడుతున్నా యి. ప్రశాంత వాతావరణం కల్పించడం ద్వారా పులులు ఈ ప్రాంతం దాటి వెళ్లేలా అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తిప్పేశ్వర్‌తో పోలిస్తే విస్తీర్ణంలో పెద్దగా ఉన్న కవ్వాల్‌ పులులకు అనుకూల ప్రదేశమని అధికారులు చెబుతున్నారు. తిప్పేశ్వర్‌ టైగర్‌ రిజర్వు 148 చదరపు కిలోమీటర్లు ఉండగా.. ఒక పులికి 10 నుంచి 15 చ.కి.మీ. విస్తీర్ణంలో ఆవాసం ఏర్పర్చుకుంటుంది. దానికంటూ ఒక ఏరియా ఏర్పర్చుకుంటుంది. ప్రస్తుతం అక్కడ 18కి పైగా పులులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆవాస విస్తీర్ణంలో పులులు ఎదురుపడితే ఘర్షణకు దిగుతాయి. దీంతో ఆ ప్రాంతం నుంచి పులుల కదలికలు మొదలై సురక్షిత ఆవాసం కోసం సంచరిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ, నేరడిగొండ, పెంబి, కడెం, ఖానాపూర్, జన్నారం, ఉట్నూర్, లక్సెట్టిపేట, తిర్యాణి ప్రాంతాల్లో దట్టమైన అడవి ఉంది.

కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులో పులులు ఉండేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని అధికారులు అభి ప్రాయపడుతున్నారు. తిప్పేశ్వర్‌ తో పోలిస్తే కవ్వాల్‌ విస్తీర్ణం చాలా పెద్దది. ఇక్కడ 2 వేల చదరపు కిలోమీటర్లు విస్తరించింది. కవ్వాల్‌లో పులుల సంచారం కనిపిస్తున్నా.. స్థిర నివాసం ఏర్పర్చుకు న్నది లేదు. దీంతో అక్కడి నుంచి వచ్చే పులులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పర్చుకునేందుకు అనువైన వాతావరణం ఉంది. తిప్పేశ్వర్‌ నుంచి కవ్వాల్‌కు అటవీ రహదారిలో 100 కి.మీ. దూరంలో ఉంటుందని చెబుతున్నారు. ఆదిలాబాద్‌లో పులుల కదలికపై జిల్లా అటవీ శాఖాధికారి ప్రభాకర్‌ను వివరణ కోరగా.. పులి రోడ్డు దాటినట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆ ప్రాంతాల్లో తమ సిబ్బంది భద్రత చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 

పులిని చూశా..
మాది ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం అవాల్‌పూర్‌. ఆదిలాబాద్‌లో నివాసం. మంగళవారం రాత్రి అవాల్‌పూర్‌ మీదుగా ఆదిలాబాద్‌కు కారులో వస్తున్నా. మార్గమధ్యంలో రాత్రి 10.40 సమయంలో జైనథ్‌ మండలం నిరాల శివారు పెన్‌గంగ కెనాల్‌ డెయిరీఫాం మధ్యకు రాగానే.. అంతర్‌ రాష్ట్ర రోడ్డు దాటుతూ పులి కనిపించింది. ఈ విషయం చెప్పి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాను. 
 – కె.అనిల్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top