గుండెల నిండా గాలి పీల్చుకోండి!

There will Be Climate Changes In Every City After Lockdown - Sakshi

నగరాలు, పట్టణాల్లో మెరుగైన వాయు నాణ్యత

లాక్‌డౌన్‌ తర్వాత హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో గణనీయమార్పు

గతేడాది ఇదే సమయంలో ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో కాలుష్య కాటు

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల్లో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు. ఒకవైపు ఉదయాన్నే పక్షుల కిలకిలారావాలు వారిని ఆహ్లాదకర వాతావరణంలో నిద్రలేపుతుండగా, గతంలో ఎప్పుడూ లేనంతగా మెరుగైన గాలి వారి శరీరంలోకి చేరి ఉత్సాహపరుస్తోంది. దీనికి ప్రధాన కారణం.. లాక్‌డౌన్‌తో వాహనాలు, ఇతరత్రా రూపాల్లోని కాలుష్యం గణనీయంగా తగ్గిపోవడంతో వాయు నాణ్యత క్రమంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో వాయునాణ్యత మెరుగ్గా రికార్డయింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌కు ముందు లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన వారం రోజుల తర్వాత నగరాల్లో గాలి నాణ్యతలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా గతేడాది (2019) మార్చి 29న వివిధ నగరాల్లోని వాయునాణ్యతతో.. ఈ ఏడాది మార్చి 29న అవే నగరాల్లోని గాలి నాణ్యతను పోల్చి చూడగా, పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెల్లడయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన వాయు నాణ్యత.. 
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు, బైక్‌లు సహా అన్ని వాహనాలు నిలిచిపోవడంతో కాలుష్యం గణనీయంగా తగ్గిపోయింది. ఈ కారణంగా గతంలో ఏ వేసవిలోనూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో వాయు నాణ్యత పెరిగింది. గత వర్షాకాలంలో రాష్ట్రంలో ఉన్న వాయునాణ్యత స్థాయిలో ప్రస్తుత పరిస్థితి కూడా ఉంది.

సమీర్‌ యాప్‌ ద్వారా ఏక్యూఐ పరిశీలన.. 
దేశవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వాస్తవ సమయం (రియల్‌టైం)లో పరిశీలించి ‘సమీర్‌యాప్‌’ద్వారా ఆ వివరాలను ఒకసూచీ ద్వారా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. తాజా వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మెరుగైన వాయునాణ్యత నమోదు కాగా.. ఉత్తరాదిలో మాత్రం కొన్నిచోట్ల పరిస్థితులు మెరుగు పడలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి ఎంతో నయంగా ఉంది. తెలంగాణలోని 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో మాన్యువల్, ఇతరత్రా పద్ధతుల్లో మానిటరింగ్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ చుట్టుపక్కలున్న సనత్‌నగర్, బొల్లారం, జూలాజికల్‌ పార్కు,హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ, పాశమైలారం, పటాన్‌చెరువులలో ఆటోమేటిక్‌ సాధనాల ద్వారా, మాన్యువల్‌గానూ గాలి నాణ్యతను నమోదు చేస్తుండగా, ప్రస్తుత లాక్‌డౌన్‌ కారణంగా మాన్యువల్‌ నమోదు జరగడం లేదు, గతంలో వేసవి సందర్భంగా ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరం వంద పాయింట్లకు పైబడి ఉండగా, ప్రస్తుతం వాయునాణ్యత 68 పాయింట్లుగా ఉంది. ఏపీ రాజధాని అమరావతి 54 పాయింట్లతో అత్యల్పంగా రికార్డ్‌ కాగా ఇతర నగరాల్లో ఎయిర్‌ క్వాలిటీ మెరుగ్గానే ఉంది.

వాయునాణ్యత తీరు ఇలా... 
ఏక్యూఐలో 50 పాయింట్ల లోపు ఉంటే స్వచ్ఛ మైన వాతావరణంతో పాటు అతినాణ్యమైన వాయువు ప్రజలకు అందుబాటులో ఉన్నట్లు లెక్కిస్తారు. 50 నుంచి 100 పాయింట్ల వరకు మంచి వాయు నాణ్యత ఉన్నట్లు అంచనా వేస్తారు. మిగతా గణాంకాలు, వాటి ప్రమాణాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఎయిర్‌క్వాలిటీ లెక్కింపు ఇలా..
వాయు నాణ్యత సూచీ ప్రమాణాలు.. ఆరోగ్యంపై చూపే ప్రభావాలు 
ముదురు ఆకుపచ్చ రంగు    
0–50పాయింట్లు గుడ్‌– 
అతి తక్కువ ప్రభావం 
లేత ఆకుపచ్చ: 50–100 సంతృప్తికరం–
సున్నితులపై స్వల్పప్రభావం
పసుపురంగు: 100–200 మోడరేట్‌–
ఆస్తమా, గుండెకు కొంత ఇబ్బంది 
ఆరెంజ్‌: 200–300 పూర్‌–
శ్వాసతీసుకోడంలో ఇబ్బందులు 
లేత ఎరుపు: 300–400 వెరీపూర్‌–
శ్వాస తీసుకోవడంలో తీవ్రప్రభావం
ముదురు ఎరుపు: 400–500 సివియర్‌–
ఆరోగ్యవంతులపైనా ప్రభావం 

తెలుగు రాష్ట్రాల్లో... 
(మార్చి 28 సాయంత్రం 4 గంటలకు అప్‌డేట్‌ చేసినప్పుడు) 
అమరావతి =54పాయింట్లు 
రాజమండ్రి =60 పాయింట్లు 
హైదరాబాద్‌ =68 పాయింట్లు 
తిరుపతి =65పాయింట్లు 
విశాఖపట్నం=88పాయింట్లు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top