వంద గ్రామాల్లో అంధకారం!

There is No Electricity At tribal Villages in the State - Sakshi

     రాష్ట్రంలో గిరిజన పల్లెల్లో కరెంటు లేని దుస్థితి

     ఇప్పటికీ విద్యుత్‌ లైన్లు వేయని ట్రాన్స్‌కో యంత్రాంగం

     ఏళ్లుగా నూనెదీపాల వెలుగుల్లోనే గిరిపుత్రులు

     అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం దెమ్మెపల్లె గ్రామానికి చెందిన రంజిత్‌ వ్యవసాయ కూలీ. వచ్చే ఆదాయంలో ఖర్చులు పోగా కొంచెం డబ్బు కూడబెట్టి ఓ టీవీ, ఫ్రిడ్జ్, కూలర్‌ కొనుగోలు చేశాడు. కానీ ఇంటికి తీసుకొచ్చిన నాటి నుంచి వాటిని అట్టా డబ్బాల్లోంచి బయటకు తీయలేదు. ఎందుకంటే అతడి ఇంటికి విద్యుత్‌ సరఫరా లేదు. ఆ మాటకొస్తే ఆ ఊరికే విద్యుత్‌ సరఫరా లేదు. 

- ఒక్క దెమ్మెపల్లె మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా వందకుపైగా గిరిజన పల్లెల్లో ఇదే పరిస్థితి. రాత్రయితే ప్రతి ఇంట్లోనూ అమావాస్య చీకట్లే. అక్కడక్కడా సోలార్‌ లైట్లు ఉన్నా.. అవి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ నుంచి మొదలుకొని ఏ చిన్న పనికైనా విద్యుత్‌ తప్పనిసరి. కాని ఎన్నోఏళ్లుగా గిరిజన గ్రామాలు కారు చీకట్లలోనే మగ్గిపోతున్నాయి. విద్యుత్‌ లైన్లు వేయాలంటూ అధికారులకు మొరపెట్టుకున్నా.. కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధిని నిలదీస్తున్నా.. ఫలితం మాత్రం శూన్యం. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వందకుపైగా గ్రామాలు ఇప్పటికీ అంధకారంలోనే ఉంటున్నాయి. విద్యుత్‌ సరఫరా లేక అభివృద్ధి ఆమడదూరంలోనే ఉండిపోయాయి. ప్రత్యేక అభివృద్ధి నిధిలో భాగంగా గిరిజన తండాలకు విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించినా.. అధికారుల ఉదాసీనతతో ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు విద్యుత్‌ లేని గ్రామాల్లో ఎక్కువ భాగం అటవీ భూములు ఉండటంతో అక్కడ కరెంటు లైన్ల ఏర్పాటుకు అటవీ శాఖ మోకాలడ్డుతోంది. రిజర్వుడ్‌ అటవీ ప్రాంతం నుంచి లైన్లు వేస్తే అటవీ సంపదకు విఘాతం కలుగుతుందని పేర్కొంటోంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గిరిజన తాండాలకు విద్యుత్‌ వెలుగులు అందడం లేదు. 

సెల్‌ఫోన్ల మౌనవ్రతం 
కరెంటు లేని గ్రామాల్లో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. తాగునీటికి చేతిపంపులే దిక్కు. కొన్నిచోట్ల గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సోలార్‌ లైట్లు ఇవ్వడంతో కొంత ఊరట లభించింది. కానీ వీటిని పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. కొందరి వద్ద సెల్‌ఫోన్లు ఉన్నా.. వాటి చార్జింగ్‌ కోసం మండల కేంద్రం, లేదంటే సమీపంలో కరెంటు ఉన్న గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. బ్యాటరీ నిండుకుంటే మళ్లీ పక్క గ్రామాలకు పరిగెత్తాల్సిందే. అప్పటివరకు సెల్‌ఫోన్లు మూగబోయి ఉండాల్సిందే. 

అధికారుల లెక్కల్లో 34 గ్రామాలే.. 
గిరిజన సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రా ష్ట్రంలో కరెంటు లేని గ్రామాలు 34 మాత్రమే ఉన్నాయి. సగటున యాభై కుటుంబాలున్న ప్రాంతాన్ని గ్రామంగా పరిగణిస్తూ గణాంకాలు రూపొందించినట్లు తెలుస్తోంది. గణాం కాలను సమర్పించిన గిరిజన సలహా మండలి.. అక్కడ విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు ఆమోదించినప్పటికీ.. పనులు మొదలుకాలేదు. 

నూనె దీపాలతోనే.. 
ఊర్లో దాదాపు వంద మంది ఉంటాం. అన్ని గుడిసెల్లోనూ రాత్రిపూట నూనె దీపాలే. కరెంటు సరఫరా కోసం అధికారులను, నాయకులను అడిగి అలిసిపోయాం. కరెంటు లైన్లు వేస్తామంటూ శంకుస్థాపన చేసినా పనులు సాగలేదు. వ్యవసాయ పనుల కోసం పడే కష్టాలు అంతాఇంతా కావు. చేసేది లేక పొరుగు గ్రామాలకు వలసలు పోతున్నాం.   
 – బిజ్జయ్య, రైతు, రాంపూర్‌ పెంట, అమ్రాబాద్‌ 

పనులు ఉన్నప్పుడే ఊర్లో.. 
ఊర్లో కరెంటు లేకపోవడంతో అందరూ అమ్రాబాద్‌కు తరలిపోతున్నారు. నేను కూడా వ్యవసాయ పనులు ఉన్నప్పుడే ఊర్లో ఉంటున్నా. గ్రామంలో పని లేకుంటే మండల కేంద్రానికి వెళ్లి కూలీ పనులు చేసుకుంటున్నా. మేజర్‌ గ్రామ పంచాయతీలో వార్డు సభ్యుడి హోదాలో కరెంటు సౌకర్యం కల్పించాలని అధికారులను వందలసార్లు కోరా. కానీ ఫలితం మాత్రం లేదు. 
–అంజయ్య, వార్డు సభ్యుడు, కొమ్మెన పెంట, అమ్రాబాద్‌ పంచాయతీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top