ప్రత్యామ్నాయం లేకనే బీజేపీకి పట్టం

There Is No Alternative For Bjp - Sakshi

ప్రజాకాంక్ష మేరకే 2019 ఎన్నికల్లో తీర్పు

‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, ఆర్టీఐ మాజీ కమిషనర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి

సాక్షి, కాజీపేట : కేంద్రంలో ప్రత్యామ్నాయ పార్టీ లేకనే 2019 ఎన్నికల్లో ప్రజలు  బీజేపీకి స్పష్టమైన తీర్పు ఇచ్చారని ‘సాక్షి’ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, ఆర్టీఐ మాజీ కమిషనర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం హన్మకొండ హంటర్‌రోడ్డులోని మాజీ మంత్రి టి.పురుషోత్తమరావు నివాసంలో ఆదివారం  ‘ప్రజా తీర్పు–2019 ఒక అవగాహన’ అనే అంశంపై నిర్వహించిన తెలంగాణ జనవేదిక సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేదిక కన్వీనర్‌ తక్కళ్లపల్లి రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనేక పార్టీలను పొత్తుగా కలుపుకున్నా బీజేపీకి  ప్రత్యామ్నాయంగా నిలబడకలేకపోయిందని అన్నారు. ఎన్నిక ల ప్రచారంలో అధికార పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం ద్వారా ప్రజలు ఎవరికి ఓటు వేయాలో తెలియక మళ్లీ బీజేపీకే పట్టం కట్టారని చెప్పారు. ఈ ఎన్నికలతోనైనా కాంగ్రెస్‌ పార్టీ గుణపాఠం నేర్చుకోవాలని హితవు పలికారు.

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రచారంలో అనుకూలమవుతాయని భావించిన నరేంద్ర మోదీ, అమిత్‌షాలు.. వ్యక్తులకు కాదు పార్టీకి పట్టం కట్టాలంటూ ప్రజలను చైతన్య పరచి మరోసారి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించే పార్టీలకు ప్రజలు ఆమోదం తెలుపుతారన్నాని అన్నారు. ఒడిషాలో స్టేటస్‌ కొనసాగించడంతో పాటు మహిళలకు అసెంబ్లీ, పార్లమెంట్‌లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించారు.. అలాగే ఏపీలో ఐదుగురు డిప్యూటీ సీఎంల ను ఏర్పాటు చేసి ఏపీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నూతన ఒరవడికి నాంది పలికారని పేర్కొన్నారు. పౌరులు సంఘటితమై ప్రశ్నించినప్పుడే మార్పు సాధ్యమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి టి.పురుషోత్తమరావు, డాక్టర్‌ కొట్టే భాస్కర్, ఆకుతోట శ్రీనివాసులు, అంజన్‌రావు, నర్మెట వీరేశం, నరేంద్ర, చంద్రమౌళి, లక్ష్మీనా రాయణ, ఎడ్ల ప్రభాకర్, రాంకిషోర్‌ పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సదస్సులో భాగంగా పలువురి ప్రశ్నలకు దిలీప్‌రెడ్డి సమాధానాలు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top