వికారాబాద్: బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయులు ఈ నెల 27వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రమేష్ పేర్కొన్నారు.
వికారాబాద్: బదిలీలు కోరుకుంటున్న ఉపాధ్యాయులు ఈ నెల 27వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రమేష్ పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో పొందు పరిచిన వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే ఎంఈ వోల దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్థానిక మేరి నాట్స్ పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులైతే ఎనిమిదేళ్లలో ఒకసారి మాత్రమే పాయింట్లు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు.
గతం లో ఈ సదుపాయాన్ని వినియోగించుకోలేదని ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుందన్నారు. 1:30 నిష్పత్తి ప్రకారం రేషనలైజేషన్ చేయగా, 380 పోస్టులు సర్‌ప్లస్‌గా ఉన్నట్లు గుర్తించామని, ఆ పోస్టులను అవసరమైన పాఠశాలలకు కేటాయంచడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 673 పోస్టులు అవసరం ఉండగా, 380 సర్‌ప్లస్ పోగా ఇంకా 273 కొత్త పోస్టులు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అవసరం ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. డీఎస్సీ కోసం జిల్లాలో 785 ఉపాధ్యాయుల పోస్టులు అవసరమని ఇదివరకే గుర్తించగా, ఈ పోస్టులు అదనమని స్పష్టం చేశారు.
పాఠశాలల్లో ఖాళీల వివరాల తుది జాబితాను ఈ నెల 28న ప్రకటిస్తామని వెల్లడించారు. జూలై 6 నుంచి ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 1:3 నిష్పత్తిలో సీనియర్టీ జాబితాలో వెబ్‌సైట్లో ఉంచామని, అభ్యంతరాలుంటే ఈ నెల 27వ తేదీలోగా డీఈఓ కార్యాలయంలో సంప్రదిం చాలన్నారు. హరితహారం కింద ప్రతి పాఠశాలలో ఒక్కో విద్యార్థి ఐదు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. బోగస్ ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగులు పొందిన విషయమై విచారణ తుది దశకు చేరుకుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, ఎంఈ వోలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.