పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో ఉత్తీర్ణ తగ్గింది. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఆరో స్థానంలో ఉండగా...
నల్లగొండ: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో ఉత్తీర్ణ తగ్గింది. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఆరో స్థానంలో ఉండగా...ఈ ఏడాది ఫలితాల్లో నాలుగో స్థానం దక్కింది. ఈ సారి ఫలితాల్లో 83.9 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కిందటేడు ఉత్తీర్ణత 93.16 శాతంగా నమోదైంది. జిల్లాలో ఈ ఏడాది 48,442 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 40,479 మంది నెగ్గారు. 23,804 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 20,341 మంది ఉత్తీర్ణులయ్యారు. 24,638 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 20,138 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత 85.8 శా తం, బాలుర ఉత్తీర్ణత 82 శాతంగా నమోదైంది. జిల్లాలో పది జీపీఏ సాధించిన విద్యార్థులు 62 మంది ఉన్నారు. మొత్తం ఫలితాల్లో పది జీపీఏ సాధించిన విద్యార్థుల ఉత్తీర్ణత 0.13 శాతంగా ఉంది.
గతేడాది సమైక్య రాష్ట్రంలో జిల్లా 6 వ స్థానంలో నిలిచింది. గతంలోని పరీక్ష విధానాలకు భిన్నంగా ఈ దఫా తొలి సారిగా సీసీఈ మోడల్‌లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 20 అంతర్గత మార్కులు కాగా 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ కొత్త విధానం విద్యార్థుల ఉత్తీర్ణత పై ప్రభావాన్ని చూపిందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఇక గడిచిన ఐదేళ్ల విద్యా సంవత్సరంలో జిల్లాలో పదోతరగతి ఫలితాలను పరిశీలిస్తే... 2010 ఫలితాల్లో 88.42 ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో నిలిచింది, 2011లో 89.89 శాతం ఉత్తీర్ణతతో 3 వస్థానం, 2012లో 92.99 శాతంతో 3 వ స్థానం సాధించింది. 2013కు వచ్చే సరికి మాత్రం ఉత్తీర్ణత 89.67 శాతానికి పడిపోయి 12వ స్థానానికి దిగజారాల్సి వచ్చింది. మళ్లీ గతేడాది ఫలితాల్లో 93.16 ఉత్తీర్ణతతో 6వ స్థానానికి చేరింది. ఇదిలాఉంటే ఆరేళ్ల నుంచి ఫలితాల్లో బాలికలే పై చేయి సాధిస్తూ వస్తున్నారు. ఉత్తీర్ణత శాతం తగ్గినప్పటికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమష్టి కృషి వల్ల శ్రేష్టమైన ఫలితాలు సాధించామని డీఈఓ ఎస్. విశ్వనాథరావు ‘సాక్షి’కి తెలిపారు.
సంక్షేమ ఫలితాలు ..
జిల్లాలో 68 బీసీ సంక్షేమ హాస్టళ్లకు చెందిన 1440 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 1182 మంది పరీక్షల్లో నెగ్గారు. వీరి ఉత్తీర్ణత 82.08 శాతం నమోదైంది. 6 హాస్టళ్లలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతను సాధించారు. 104 సాంఘికసంక్షేమ హాస్టళ్లకు చెందిన 1920 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1471మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి ఉత్తీర్ణత 77 శాతంగా నమోదైంది. 7 హాస్టళ్లలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతను సాధించారు. 37 ఎస్టీ సంక్షేమ హాస్టళ్లకు చెందిన 2,183 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1,778 మంది పరీక్షల్లో నెగ్గారు. వీరి ఉత్తీర్ణత 81 శాతం నమోదైంది. 5 హాస్టళ్లలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 46 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. ఈ మొత్తం పాఠశాలల నుంచి 1385 మంది బాలికలు హాజరుకాగా 1165 మంది ఉత్తీర్ణులయ్యారు. పది పాఠశాలల్లో విద్యార్థినులు వంద శాతం ఫలితాలు సాధించారు. మరో 12 పాఠశాలలు 95 శాతం ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్రంలో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
పునః పరిశీలన గడువు ఈ నెల 28 వరకు
జవాబు పత్రాలను పునః పరిశీలించేందుకు విద్యార్థులు ఈ నెల 28 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విశ్వనాథరావు తెలిపారు. దీనికి ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని సూచించారు. ఈ దరఖాస్తులు డీఈఓ కార్యాలయంలో పొందవచ్చన్నారు.


