
హైదరాబాద్: ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఇంటి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐలయ్య రాసిన ‘‘కోమటోళ్లు – సామాజిక స్మగ్గర్లు’’పుస్తకంపై చర్చించేందుకు ఆయన ఇంటికి వస్తానని ఆర్యవైశ్య సంఘం నాయకుడు శ్రీనివాస్‌గుప్త ప్రకటించడంతో ముందస్తుగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు భారీగా మోహరించారు. ఐలయ్య ఇంటికి చేరుకుంటున్న క్రమంలో శ్రీనివాస్‌గుప్త, పలువురు ఆర్యవైశ్యులను వర్సిటీ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి అంబర్‌పేట ఠాణాకు తరలించారు.
కాగా, తాను రాసిన పుస్తకం ఒక జాతీయ స్థాయి అంశమని, దీనిపై చర్చించాలంటే ఢిల్లీలోని జేఎన్‌యూలో చర్చించాలే తప్ప, పుస్తకాలు చింపి పొట్లాలు కట్టుకునే వారితో చర్చించేది లేదని ఐలయ్య స్పష్టం చేశారు. ఈ పుస్తకంపై చట్టపరంగా కోర్టులు తప్పని చెబితే తప్ప మార్చేది లేదన్నారు. శ్రీనివాస్ గుప్త మీడియాలో తనపై బూతులు మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి నిరసన కార్యక్రమాలతో నెల రోజులుగా తనపై యుద్ధం ప్రకటించారన్నారు. ఇదంతా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు తెలియకుండానే జరుగుతుందా అని ప్రశ్నించారు.