‘ఏకగ్రీవం’పై కసరత్తు

Telangana Panchayat Elections TRS Leaders Nizamabad - Sakshi

‘పంచాయతీ’ ఎన్నికలపై అధికార పార్టీ ప్రణాళికలు 

అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేలా ప్రయత్నాలు ముమ్మరం 

నిజామాబాద్‌అర్బన్‌: గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడంతో పల్లెల్లో రాజకీయం వేడెక్కింది. ఇదివరకే రిజర్వేషన్లు ప్రకటించడంతో పోటీకి ఆశావహులు సిద్ధమవుతున్నారు. అయితే జిల్లాలో అత్యధిక స్థానాలను ఏకగ్రీవం చేసి కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కిందిస్థాయి నేతలకు సూచనలు చేస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను తమ పార్టీ నాయకులు కైవసం చేసుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

గత ఎన్నికల్లో 71 స్థానాలు..
గత పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 71 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో 530 గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎన్ని స్థానాలు ఏకగ్రీవం అవుతాయోనని చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్‌ స్థానాలను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఇందుకు అనుగుణంగా పార్టీ మండల స్థాయి నాయకులకు గ్రామ స్థాయి నాయకులకు ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేశారు.

తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో 58 మేజర్‌ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటిని కైవసం చేసుకోవాలని అధికార పార్టీ నేతలు తాపత్రయపడుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడంతో పంచాయతీ ఎన్నికల్లోనూ నాయకులు అదే ఉత్సాహంతో ముందుకుసాగుతున్నారు.

జిల్లాలో వంద శాతం ఎస్టీ గ్రామాలు 71 ఉండగా, ఎస్టీ రిజర్వుడ్‌ 31, ఎస్సీ రిజర్వుడ్‌ 101, బీసీ రిజర్వుడ్‌ 98, జనరల్‌ 229 గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులను బట్టి గ్రామాల్లో సర్పంచ్‌తో పాటు వార్డు స్థానాలను సైతం ఏకగ్రీవం చేసుకోవాలని అధికార పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. గత గురువారం భీమ్‌గల్‌ మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని నిర్ణయించారు. అలాగే సికింద్రాపూర్‌ తండా పంచాయతీలో సర్పంచ్, ఉపసర్పంచు పదవులను ఏకగ్రీవం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇలా ఆయా గ్రామాల్లో శాసన సభ్యులతో పాటు, అధికార పార్టీ నాయకులు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

జిల్లాలో మొదటి విడతలో ఆర్మూర్‌ డివిజన్‌లో 177 పంచాయతీల్లో, 1,846 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. రెండో విడతలో బోధన్‌ డివిజన్‌లో 142 పంచాయతీల్లో, 1,296 వార్డుల్లో, మూడో విడతలో నిజామాబాద్‌ డివిజన్‌లోని 211 గ్రామాలు, 1,890 వార్డుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.  దీంతో ఆయా డివిజన్లలో ఏకగ్రీవం కోసం నేతలు దృష్టి సారించారు. జిల్లాలో కొత్తగా 150 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.

ఇందులో చాలావరకు తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఎక్కువగా ఉండడంతో, పైగా అధికార పార్టీ నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో తేలికగా ఏకగ్రీవం చేసుకోవచ్చని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు గతంలో ప్రభుత్వం నజారాలను ప్రకటించింది. అయితే ఇందులో కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినా వాటికి నజారానాలు అందలేదు. ఈ ప్రభావం ప్రస్తుతం ఏమైనా ఉంటుందా అని అధికారులు భావిస్తున్నారు.

గ్రామ కమిటీల పెత్తనం కొనసాగేనా..! 
జిల్లాలో గత ఎన్నికల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికపై గ్రామ కమిటీలు నిర్ణయించేవి. ముఖ్యంగా ఆర్మూర్, నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో గ్రామ కమిటీల పెత్తనం కొనసాగేది. గ్రామ కమిటీకి ఎవరైతే ఎక్కువగా డబ్బు లు చెల్లిస్తారో ఆ వ్యక్తిని, లేదా గ్రామ కమిటీ సభ్యులు నిర్ణయించిన వ్యక్తిని సర్పంచ్‌గా, ఉపసర్పంచ్‌గా ఎన్నుకునేవారు.

కొన్ని గ్రామాల్లో వేలం పాటలు కూడా సాగేవి. కొన్ని గ్రామాల్లో వాగ్వాదాలు, గొడవలు కూడా జరిగాయి. ఇంత జరిగినా అధికారులు, పోలీసులు మాత్రం ఏం చేయలేకపోయారు. ఈసారి అలా పరిస్థితి ఎదురుకావద్దని అధికార యంత్రాంగం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో ఈ ప్రయత్నాలు ఫలించేలా కనిపించడంలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతాయో, ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవం అవుతాయో, ఎన్ని చోట్ల ఎన్నికలు జరుగుతాయో వేచిచూడాల్సిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top