తీన్‌మార్‌ 

Telangana Panchayat Election Ends - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. తొలి, మలి విడతల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ.. మూడో విడతలోనూ అత్యధిక స్థానాలను దక్కించుకుంది. రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 24 జీపీలు ఏకగ్రీవం కావడంతో బుధవారం 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. వీటిలో ఏకగ్రీవాలతో కలుపుకుని టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 114, కాంగ్రెస్‌ 50, టీడీపీ 2, సీపీఐ 5, సీపీఎం 10, స్వతంత్ర అభ్యర్థులు 11 స్థానాల్లో గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందుకు భిన్నంగా టీఆర్‌ఎస్‌ తన ప్రభావం చూపడం విశేషం. జిల్లాలో మొత్తం 584 గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఒక జీపీ ఎన్నిక వాయి దా పడింది.

మూడు విడతలుగా జరిగిన జీపీ ఎన్నికలను టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారం నిర్వహించడం ద్వారా పల్లె రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో దాదాపు ప్రశాంతంగానే ముగిశాయి. మూడో విడతలో ఒకటి, రెండు మండలాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చింతకాని మండ లం నేరెడ జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారుగా పోటీ చేసిన ఈశ్వరమ్మ ఐదు ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించగా.. దీనిపై టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేసి రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేశారు. దీంతో రీకౌంటింగ్‌ నిర్వహించిన అనంతరం అధికారులు ఈశ్వరమ్మ ఐదు ఓట్లతో గెలిచినట్లు ధ్రువీకరించారు.

మూడోవిడత పంచా యతీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, రాములునాయక్‌ నియోజకవర్గాలైన ఖమ్మం, వైరా, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో జరిగాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా.. అత్యధిక స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 12 స్థానాలు ఏకగ్రీవం కావడానికి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ చొరవ తీసుకోగా.. మిగిలిన పంచాయతీల్లో టీఆర్‌ఎస్‌ విజయం కోసం స్వయంగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. బుధవారం 25 జీపీలకు ఎన్నికలు జరగ్గా.. టీఆర్‌ఎస్‌ 13 జీపీలను, కాంగ్రెస్‌ 11, సీపీఐ ఒక గ్రామ పంచాయతీని గెలుచుకున్నాయి. వైరా, మధిర నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల, వైరా మండలాల్లో మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది.

సీపీఎం, సీపీఐలు మూడు విడతల ఎన్నికల్లో తమ ప్రాభవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకునే స్థాయిలో పంచాయతీలను గెలుపొందగా.. టీడీపీ ఉనికి పంచాయతీ ఎన్నికల్లో మరింత ప్రశ్నార్థకంగా మారింది. 2013 ఎన్నికల్లో అత్యధిక జీపీలను గెలుచుకున్న పార్టీగా గుర్తింపు పొందిన టీడీపీ ఈ ఎన్నికల్లో 25 స్థానాలను సైతం గెలుచుకోలేకపోయింది. మధిర మండలంలో స్వతంత్ర అభ్యర్థులు 6 పంచాయతీలను కైవసం చేసుకోగా.. టీఆర్‌ఎస్‌ 14, కాంగ్రెస్‌ 6 పంచాయతీలను గెలుచుకున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం రఘునాథపాలెం మండలం మంచుకొండలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. సర్పంచ్‌ పదవికి పోటీ చేసిన వారిలో ఒకరు గెలిచి.. మరొకరు ఓడిపోవడంతో ఇరువర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ ఈ ఉద్రిక్తతకు దారితీసింది.

 మూడు విడతల్లోనూ గులాబీదే హవా.. 
మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా కొనసాగింది. మొత్తం 584 గ్రామ పంచాయతీలకుగాను.. ఏన్కూరు మండలం నూకాలంపాడు జీపీకి ఎన్నిక జరగలేదు. 80 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మొత్తం 503 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఏకగ్రీవాలతో కలిసి టీఆర్‌ఎస్‌ మూడు విడతల్లో 351 జీపీలు, కాంగ్రెస్‌ 114, సీపీఎం 24, సీపీఐ 12, టీడీపీ 22, న్యూడెమోక్రసీ 5, బీజేపీ ఒక జీపీ, స్వతంత్ర అభ్యర్థులు 54 గ్రామ పంచాయతీల్లో గెలుపొందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top