సంక్రాంతికి ‘తెలంగాణ పల్లె ప్రగతి’: కేటీఆర్ | telangana palle pragathi to be launched, says ktr | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ‘తెలంగాణ పల్లె ప్రగతి’: కేటీఆర్

Dec 27 2014 1:48 AM | Updated on Jul 6 2018 3:32 PM

సంక్రాంతికి ‘తెలంగాణ పల్లె ప్రగతి’: కేటీఆర్ - Sakshi

సంక్రాంతికి ‘తెలంగాణ పల్లె ప్రగతి’: కేటీఆర్

సమీకృత గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా సంక్రాంతిలోగా ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.తారకరామారావు ప్రకటించారు.

  సాక్షి, హైదరాబాద్: సమీకృత గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా సంక్రాంతిలోగా ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖమంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ కార్యక్రమానికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని మంత్రి తెలిపారు. దీని అమలు ప్రణాళికపై శుక్రవారం బేగంపేట్‌లోని క్యాంపు కార్యాలయంలో సెర్ప్ అధికారులతో ఆయన సమీక్షించారు. తొమ్మిది జిల్లాల్లోని 150 వెనుకబడిన మండలాల అభివృద్ధి కోసం రూ. 653 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 203 కోట్లు కాగా, ప్రపంచ బ్యాంకు రుణం రూ. 450 కోట్లుగా ఉంటుందన్నారు. ఎంపిక చేసిన 150 మండలాల్లో మొత్తం 2,900 పంచాయితీలు ఉన్నాయని, వీటి పరిధిలో 1,950 గ్రామాలు, 10,600 పునరావాస ప్రాంతాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటన్నింటి అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద 78 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
 
 పల్లె ప్రగతికి ప్రణాళికలు
 
 జీవనోపాధిని పెంపొందించడంలో భాగంగా గ్రామీణులు స్వయం సమృద్ధి సాధించేలా శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. వ ్యవసాయంలో రైతులకు మరింత సాయం అందించేందుకు ప్రణాళికలను కూడా ఈ కార్యక్రమంలో చేర్చామని పేర్కొన్నారు.  వ్యవసాయదారుల సహకార సంస్థలను ఏర్పాటు చేసి రైతులే సమష్టిగా తమ ఉత్పత్తులను అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకంతో పాటు వరి, తృణధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో రైతాంగానికి చేయూతనిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా మార్కెటింగ్ సదుపాయాలను(రూరల్ అవుట్‌లెట్స్) కల్పిస్తామన్నారు. మానవాభివృద్ధి సూచికలను పెంచే ప్రణాళికలో భాగంగా ఆయా గ్రామాల్లోని మహిళలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
 
 సమగ్ర పౌరసేవా కేంద్రాలు
 
 ఎంపిక చేసిన గ్రామాల ప్రజలకు అన్ని సేవలు ఒకేచోట లభించేలా సమగ్ర పౌర సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వెయ్యి గ్రామాల్లో ప్రత్యేక కియోస్క్‌లను ఏర్పాటు చేసి పౌర సేవలను అందించనున్నట్లు తెలిపారు. సాధారణ సేవలతో పాటు నగదు బదిలీ, ఉపాధి హామీ, పింఛన్ల చెల్లింపులను కూడా ఈ కేంద్రాల నుంచి పొందవచ్చన్నారు. ఇకపై ప్రభుత్వ విభాగాలకు ప్రజలు ఇచ్చే అర్జీలను, ఫిర్యాదులను ఈ కేంద్రాల్లోనే స్వీకరిస్తారని చెప్పారు. మహిళా సాధికారతను పెంపొందించే దిశగా.. ఆయా కేంద్రాల నిర్వహణను స్థానికంగా విద్యావంతులైన మహిళలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సమీక్షలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో మురళితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 
 అభివృద్ధి కార్యక్రమం                        నిధులు(రూ. కోట్లలో)

 ఉత్పత్తిదారుల సంస్థలు, జీవనోపాధి            272
 మానవాభివృద్ధి సూచికల పెంపు                120
 పల్లెల్లో సమగ్ర పౌర  సేవా కేంద్రాలు             64
 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటు                120
 ప్రాజెక్టు నిర్వహణ నిమిత్తం                 76

 మొత్తం                                653
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement