‘తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించండి’

Telangana Opposition Parties Meets Governor Narasimhan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను అఖిల పక్షం నేతలు మంగళవారం కలిశారు. ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్‌ను కొనసాగించొద్దని కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌, టీడీపీ పార్టీల నాయకులు గవర్నర్‌ను కోరారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే రాష్ట్ర పతి పాలన విధించాలని గవర్నర్‌ను విపక్షాలు కోరాయి.

రాజీవ్ శర్మ బ్రోకరా? : ఉత్తమ్ కుమార్ రెడ్డి 
మోదీ, కేసీఆర్, ఎన్నికల కమిషన్ కలిసి తెలంగాణ ప్రజల హక్కును కాలరాసేలా నిర్ణయం తీసుకున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలు ఎలా జరగాలో కూడా కేసీఆర్‌ ముందే షెడ్యూల్ విడుదల చేశారన్నారు. ఓటర్ లిస్టులో 20 లక్షల ఓట్లు తగ్గించి వాటిని సవరించకుండా ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. 6న గవర్నర్‌ను కలిసిన తరువాత కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌తో మాట్లాడాను అని చెప్పారని, ఆన్ రికార్డ్ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మతో కూడా మాట్లాడానని చెప్పారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తరపున రాజీవ్ శర్మ ఎన్నికల కమిషన్‌ను ఎలా కలుస్తారు, ఆయన ఏమైనా బ్రోకరా అని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారన్నారు. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఆపద్ధర్మ ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం : కోదండ రామ్‌
ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుందని గవర్నర్‌ను కలిశామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్‌ అన్నారు. ఓటర్ల పేర్లు ఓటర్ లిస్ట్‌లో గల్లంతయ్యాయన్నారు. వినాయక చవితి, దసరా పండుగలలో ప్రజలు బిజీగా ఉంటారు అందువల్ల ఓటరు నమోదు కార్యక్రమం సరిగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు.

ఇష్టానుసారంగా కేసీఆర్ పాలన : ఎల్‌ రమణ
తెలంగాణలోని రాజ్యాంగ సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని టీటీడీపీ అధ్యక్ష్యుడు ఎల్‌ రమణ అన్నారు. ఎన్నికల సంఘాన్ని సంప్రదించామని కేసీఆర్ చెప్పడం చూస్తే కేంద్రంతో కుమ్మక్కై,రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. సచివాలయానికి రాకుండా పరిపాలన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. టీజేఎస్, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ అన్ని పార్టీలు కలిసి రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతి పాలనను విధించమని కోరుతామని పేర్కొన్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగడానికి వీలు లేదన్నారు.

రాజ్యాంగ విరుద్ధంగా తెలంగాణలో పాలన : చాడ వెంకట్ రెడ్డి 
తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతుందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి 100 సీట్లు గెలుస్తామంటున్నారని, మోదీతో కలిసి ఎన్నికల షెడ్యూల్ కూడా కేసీఆర్ ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. రేపు కేసీఆర్ తను అనుకున్నది చేయడానికి ఎంతమంది పైన కేసులు పెట్టడానికైనా వెనకాడరన్నారు. కేసీఆర్‌పై ఫిర్యాదు చేస్తే గవర్నర్ ఏమాత్రం స్పందించలేదన్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పతికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. నవంబర్‌లో ఎన్నికలు రావడానికి అనేక అక్రమాలు చేస్తున్నారని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకునేలా కూడా ఆలోచిస్తామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top