
సాక్షి, హైదరాబాద్: అవయవదానంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్‌వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇందుకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) అవార్డును ప్రకటించింది. సోమవారం ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’సందర్భంగా ప్రభుత్వం తరఫున జీవన్‌ధాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ అవార్డు అందుకోనున్నారు.
తమిళనాడును దాటేసి..
తమిళనాడు జనాభా 8 కోట్లు కాగా.. తెలంగాణ జనాభా 3.5 కోట్లు. తమిళనాడులో గత 11 ఏళ్లలో 5,367 అవయవాలను సేకరించి దేశంలోనే తొలి స్థానంలో ఉంది. తెలంగాణలోని నిమ్స్ జీవన్‌దాన్ ఆధ్వర్యంలో 2013 నుంచి 2017 అక్టోబర్ వరకు 414 మంది దాతల నుంచి 1,675 అవయవాలను సేకరించారు. గతేడాది వరకు రెండోస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి తొలిస్థానంలో నిలిచింది. జనాభా ప్రతిపాదికన పరిశీలిస్తే.. తమిళనాడుతో పోలిస్తే అవయవ దానంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఎన్‌వోటీటీవో తెలిపింది. అవయవదానంపై అవగాహన, శిక్షణ, సాప్ట్‌వేర్ నిర్వహణ.. ఇలా అన్ని విభాగాల్లోనూ ముందు నిలిచిందని కొనియాడింది. ఇక కేరళ ఇప్పటివరకు 701 అవయవాలు సేకరించి మూడోస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బ్రెయిన్‌డెడ్ స్థితిలో తమ అవయవాలను దానం చేసేందుకు అనేక మంది ఇప్పటికే తమ పేర్లను జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్నారు. దాతల్లో ప్రముఖ క్రీడాకారులు అనిల్‌కుంబ్లే, గౌతం గంభీర్, నటుడు అక్కినేని నాగార్జున, హీరోయిన్ ప్రియాంకా చోప్రా, టాలీవుడ్ నటి సమంత సహా 30 వేల మందికిపైగా ఉన్నారు. మరోవైపు 4,203 మంది గుండె, కాలేయం, కిడ్నీ దాతల కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో 2,221 మంది కిడ్నీ కోసం, 1,897 మంది కాలేయ మార్పిడి చికిత్సల కోసం ఎదురుచూస్తున్నారు.
అవయవ మార్పిడికి కేంద్ర బిందువుగా..
అవయవమార్పిడి చికిత్సలను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చింది. బ్రెయిన్‌డెడ్ దాత నుంచి సేకరించిన గుండె, కాలేయ మార్పిడి చికిత్సలకు రూ.10.5 లక్షల చొప్పున, ఏకకాలంలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సకు రూ.13.6 లక్షలు, బోన్‌మ్యారో చికిత్సకు రూ.8.7 లక్షలు, లైవ్‌డోనర్ కాలేయ మార్పిడి చికిత్సకు రూ.13 లక్షల చొప్పున చెల్లిస్తోంది. కేవలం బ్రెయిన్‌డెడ్ బాధితులే కాదు.. బతికుండగానే శరీర భాగాలను బాధితులకు ఉచితంగా ఇచ్చేందుకు బంధువులు(లైవ్ డోనర్స్)ముందుకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ అవయవ మార్పిడికి కేంద్ర బిందువుగా మారుతోంది.
ఈ అవార్డు బాధ్యతను పెంచింది: లక్ష్మారెడ్డి, మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ
అవయవదానంలో రాష్ట్రానికి జాతీయస్థాయిలో ప్రథమ స్థానం లభించడం సంతోషం. ఈ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది. అన్ని దానాలకంటే అవయవదానం గొప్పది. జీవితానంతరం ప్రతి ఒక్కరూ అవయవాలను దానం చేయాలి. ఒక వ్యక్తి చేసిన అవయవదానంతో మరో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు.