బీజేపీ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి

Published Sat, Jul 12 2014 5:00 PM

బీజేపీ కార్యాలయంపై తెలంగాణ వాదుల దాడి - Sakshi

హైదరాబాద్:పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంపై తెలంగాణ వాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో చేసిన సవరణలను నిరసిస్తూ తెలంగాణ జాగృతి కార్యకర్తలు శనివారం బీజేపీ కార్యాలయంపై దాడికి దిగారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలపడం తగదంటూ ఆందోళన చేపట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపుటలా జరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ జాగృతి కార్యకర్తలను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తెలంగాణ జాగృతి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలవరం ముంపు మండలాల అంశానికి సంబంధించి పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్విజన బిల్లులో చేసిన సవరణలకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ జేఏసీ, వామపక్షాలు ఈ రోజు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  ఈ మేరకు జిల్లాలో శుక్రవారం కూడా తెలంగాణ జిల్లాల్లో తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆంధ్ర పాలకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దొడ్డిదారిలో సవరణకు ఆర్డినెన్స్ తెచ్చి కుట్రలు చేసిందని దుయ్యబట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement