స్పోర్ట్స్ టవర్‌లోకి తెలంగాణ హైకోర్టు! | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ టవర్‌లోకి తెలంగాణ హైకోర్టు!

Published Thu, Nov 13 2014 12:27 AM

స్పోర్ట్స్ టవర్‌లోకి తెలంగాణ హైకోర్టు! - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ హైకోర్టును గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్‌లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం పాతబస్తీలో కొనసాగుతున్న ఉన్నత న్యాయస్థానంలో ఉమ్మడి కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ న్యాయస్థానాన్ని వేరొక చోటకు మార్చాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కింగ్‌కోఠిలోని పరదా ప్యాలెస్, ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ భవన సముదాయాన్ని స్వయంగా పరిశీలించారు.

హైకోర్టు అవసరాలకు తగ్గట్టుగా ఇవి లేవని భావించిన ప్రభుత్వం.. తాజాగా జీఎంసీ బాలయోగి స్టేడియం సమీపంలోని ‘స్పోర్ట్స్ టవర్’ను పరిశీలించింది. ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ టవర్‌ను సందర్శించింది. 14 అంతస్తుల ఈ భవన సముదాయం కోర్టు నిర్వహణకు అనుకూలంగా ఉందని, ట్రాఫిక్ సమస్య కూడా ఉండదనే అభిప్రాయపడింది.

 ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి స్పోర్ట్స్ టవర్‌లోకి ‘టీ’ హైకోర్టును షిప్ట్ చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆఫ్రో -ఏషియన్ గేమ్స్ సమయంలో ఈ టవర్‌ను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. క్రీడాకారులు, ఇతరులు విడిదికి అనుకూలంగా డిజైన్ చేసిన ఈ భవనం శాప్ ఆధీనంలో కొనసాగుతోంది.

Advertisement
Advertisement