breaking news
Sports Tower
-
స్పోర్ట్స్ టవర్ పునఃప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు గచ్చిబౌలి స్పోర్ట్స్ టవర్ క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర క్రీడల మంత్రి టి. పద్మారావు బుధవారం ఈ టవర్‌ను పునఃప్రారంభించారు. అనంతరం ఆయన ఈ టవర్లోని గదులను, అక్కడి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అంతర్జాతీయ మిలిటరీ గేమ్స్ (2007) సందర్భంగా గచ్చిబౌలిలోని క్రీడాగ్రామంలో రూ. కోట్లు వెచ్చించి దీన్ని నిర్మించారు. అయితే నిర్మించిన సంస్థతో ఒప్పంద వివాదం, నిర్వహణ కరువవడంతో ఇది పూర్తిగా నిరుపయోగంగా మారింది. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ టవర్‌ను క్రీడాకారుల కోసం నవీకరించింది. ఇప్పుడు ‘సీఐఎస్ఎఫ్ ఆలిండియా పోలీస్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్’ కోసం దీన్ని ఉపయోగించనున్నారు. ఈ పోటీలు ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం 5 స్టార్ సదుపాయాలున్న స్పోర్ట్స టవర్‌ను ఇవ్వడం పట్ల సీఐఎస్ఎఫ్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి. -
స్పోర్ట్స్ టవర్‌లోకి తెలంగాణ హైకోర్టు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ హైకోర్టును గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్‌లోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం పాతబస్తీలో కొనసాగుతున్న ఉన్నత న్యాయస్థానంలో ఉమ్మడి కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ న్యాయస్థానాన్ని వేరొక చోటకు మార్చాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కింగ్‌కోఠిలోని పరదా ప్యాలెస్, ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ భవన సముదాయాన్ని స్వయంగా పరిశీలించారు. హైకోర్టు అవసరాలకు తగ్గట్టుగా ఇవి లేవని భావించిన ప్రభుత్వం.. తాజాగా జీఎంసీ బాలయోగి స్టేడియం సమీపంలోని ‘స్పోర్ట్స్ టవర్’ను పరిశీలించింది. ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ టవర్‌ను సందర్శించింది. 14 అంతస్తుల ఈ భవన సముదాయం కోర్టు నిర్వహణకు అనుకూలంగా ఉందని, ట్రాఫిక్ సమస్య కూడా ఉండదనే అభిప్రాయపడింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి స్పోర్ట్స్ టవర్‌లోకి ‘టీ’ హైకోర్టును షిప్ట్ చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆఫ్రో -ఏషియన్ గేమ్స్ సమయంలో ఈ టవర్‌ను అప్పటి ప్రభుత్వం నిర్మించింది. క్రీడాకారులు, ఇతరులు విడిదికి అనుకూలంగా డిజైన్ చేసిన ఈ భవనం శాప్ ఆధీనంలో కొనసాగుతోంది.