మొహమాటాల్లేవ్‌..!

Telangana Government To Take Action On Sloppy Bureaucrats Sarpanches - Sakshi

జనవరి 1 నుంచి పల్లె ప్రగతిపై ఆకస్మిక తనిఖీలు

కఠిన చర్యల విషయంలో శషబిషలు ఉండవు

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో తనిఖీ బృందాల ఏర్పాటు

పల్లె ప్రగతిపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ 

సాక్షి, హైదరాబాద్‌ : పల్లె ప్రగతి కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ రంగంలోకి దిగనున్నాయని, పల్లెల్లో ప్రగతి కార్యక్రమాలు, నాణ్యతను ఈ బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అలసత్వం వహించినట్లు తనిఖీల్లో రుజువైన అధికారులు, వంద శాతం పనిచేయని సర్పంచులపై తగు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏ మాత్రం మొహమాటాలు  లేవని స్పష్టం చేశారు. అలసత్వం వహించినట్లు తేలిన అధికారులపై కఠిన చర్యలుంటాయన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమ పురోగతిపై ఆదివారం ఆయన ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. 

పచ్చని, పరిశుభ్రమైన పల్లెల కోసం సెప్టెంబర్‌ మొదటివారంలో ప్రారంభించిన 30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమం జనాదరణ పొందిందని సీఎం పేర్కొన్నారు. ఇందులో స్థానికులు భాగస్వామ్యం పంచుకోవడం శుభపరిణామమన్నారు. ప్రజలు చూపిస్తున్న ఉత్సాహాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు చూపించడం లేదని క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. 100 శాతం ఫలితాల కోసం తనిఖీలు చేపట్టి, ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చన్నారు. దీనిలో భాగంగానే ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేసి పనితీరు మెరుగుపరుచుకోని అధికారులు, ప్రజాప్రతినిధుల మీద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు..
‘పల్లెలను బాగుచేసుకోవడం కన్నా మించిన పని ప్రభుత్వానికి లేదు. అధికారుల మీద ప్రజాప్రతినిధుల మీద విశ్వాసంతోనే, వారికి కావాల్సినంత సమయాన్ని ఇచ్చినం. అందుకే తనిఖీల కోసం ఆత్రపడలేదు. ఈ తనిఖీలు ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు. జనవరి 1 నుంచి పల్లె ప్రగతి తనిఖీలు ప్రారంభించనున్నం’అని సీఎం వివరించారు.

మారకపోతే వారిదే బాధ్యత..
‘పంచాయతీరాజ్‌ శాఖలో అన్ని స్థాయిల ఉద్యోగులకు వారు ఊహించని విధంగా పదోన్నతులు ఇచ్చాం. గ్రామ కార్యదర్శుల నియామకం చేపట్టడం నుంచి.. ఎంపీడీవో, డీఎల్పీవో, డీపీవో, జిల్లా పరిషత్‌ సీఈవో, డిప్యూటీ సీఈవో అన్ని స్థాయిల్లో వ్యవస్థను పటిష్టపరిచి, శాఖను బలోపేతం చేశాం. అలాగే పల్లె ప్రగతిలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం.. పంచాయతీలకు ప్రతినెలా రూ.339 కోట్లను టంచనుగా ప్రభుత్వం విడుదల చేస్తోంది. పల్లెను అభివృద్ధిపథంలో నడిపించేలా జిల్లా కలెక్టర్లను నిరంతరం అప్రమత్తం చేస్తూ తగు సూచనలు ఇస్తున్నం. పంచాయతీరాజ్‌ చట్టంలో కూడా కలెక్టర్లకు ఆ మేరకు అధికారాలిచ్చాం. పచ్చదనం, పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు గ్రామస్థాయిలో పని వ్యవస్థలను కూడా పటిష్టం చేసినం. పంచాయతీ కార్మికుల జీతాలు కూడా పెంచినం. ఇన్ని చర్యలు తీసుకున్నాక కూడా పల్లెల్లో ప్రగతి అనుకున్ననట్లు ముందుకు పోకపోతే అది కలెక్టర్లు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులదే బాధ్యత’అని స్పష్టం చేశారు. 

గోప్యంగా తనిఖీలు...
‘ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, మూడు క్యాడర్లనుంచి ఉన్నతాధికారులను నియమించి తనిఖీ వ్యవస్థను ఏర్పాటు చేస్తం. ప్రతి అధికారికి ర్యాండమ్‌ విధానంలో వివిధ జిల్లాల్లోని 12 మండలాల చొప్పున ఆకస్మిక తనిఖీల బాధ్యత అప్పగిస్తం. ఎవరికి ఏ మండలాన్ని అప్పగిస్తామనేది ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. ఆకస్మికంగా విడతల వారీగా నిర్వహించే తనిఖీల ద్వారా పల్లె పురోగతి క్రాస్‌ చెక్‌ అవుతుంది. తద్వరా ప్రభుత్వానికి సరైన సూచనలు, సలహాలు అందుతాయని’సీఎం అన్నారు. 

పనితీరుకు ఓ పరీక్ష...
‘ఈ తనిఖీల ద్వారా పల్లె ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధిని వారి శక్తి సామర్థ్యాలను ప్రభుత్వం అంచనా వేస్తుంది. పలు రకాల తోడ్పాటు ఇచ్చినంక కూడా గ్రామాలు బాగుపడకపోతే ఇక జీవితంలో అవి బాగుపడవు. అలా కావడానికి వీల్లేదు’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గ్రామాలన్నీ అద్దంలా తీర్చిదిద్దేవరకు ఎట్టి పరిస్థితిల్లో ప్రభుత్వం విశ్రమించదని చెప్పారు. అత్యవసర పనిమీద బెంగళూరు వెల్లవలసిన పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘనందన్‌ రావు ప్రయాణాన్ని వాయిదా వేయించి మరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నం అంటే, పల్లె ప్రగతిపై ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో చేసుకోవాలె అని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌ రావు, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్, డైరెక్టర్‌ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top