‘పాలమూరు’ పరుగులు      

Telangana Government Speeds Up Palamuru Rangareddy Project Work - Sakshi

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.10వేల కోట్లు 

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రుణం మంజూరు  

ప్రాజెక్టుకు తీరనున్న నిధుల కొరత  

ఇదివరకే పర్యావరణ, అటవీ అనుమతులు జారీ  

ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకోనుంది. నిధుల సమస్యతో నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.10వేల కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. రుణం మంజూరైన వెంటనే మందకొడిగా సాగుతోన్న ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రుణ  ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిధులు మంజూరు చేయడమే మిగిలిందని అధికారులు చెబుతున్నారు.

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాల్లో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం 2015 జూన్‌లో ప్రతిష్టాత్మకంగా రూ.35,200కోట్లతో పాలమూరు–ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టింది. ఈ అప్పట్లో సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ వద్ద కరివెన రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తర్వాత కాంట్రాక్టర్ల ఒప్పందం కోసం పది నెలల సమయం పట్టింది. చివరకు 2016 మే నుంచి పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో 2018 ఆఖరులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయి తే ప్రాజెక్టు పనులు వేగంగా చేసేందుకు సరిపడా నిధులు లేకపోవడంతో పనుల్లో వేగం తగ్గింది. ఇప్పటి వరకు సుమారు రూ.10వేల కోట్ల మేర పనులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం రుణం మంజూరు కానుండడంతో పనుల్లో వేగం మరింత వేగం పెరిగే అవకాశం ఉంది.  

ప్రాజెక్టు స్వరూపం ఇదీ.. 
శ్రీశైలం వెనక జలాల నుంచి నీటిని ఎత్తిపోసేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న కేఎల్‌ఐ ప్రాజెక్టులకు సంబంధించి నీటిని నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేకపోవడంతో ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించేందుకు నిర్ణయించింది. మొత్తం ఆరు రిజర్వాయర్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇందులో సర్కిల్‌–1లో కొల్లాపూర్‌ పరిధిలోని నార్లాపూర్‌లో 8.55 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వనపర్తి పరిధిలోని ఏదుల 6.99టీఎంసీలు, నాగర్‌కర్నూల పరిధిలోని వట్టెం వద్ద 16.75 టీఎంసీలు, మహబూబ్‌నగర్‌ పరిధిలోని కరివెన వద్ద 17.34 టీఎంసీలు, సర్కిల్‌–2 పరిధిలోని ఉద్దండాపూర్‌ వద్ద 9.1టీఎంసీలు, రంగారెడ్డి జిల్లాలోని కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద 3 టీఎంసీలు (గతంలో 10 టీఎంసీల అంచనా ఉండగా> కుదించారు)మొత్తం ఆరు రిజర్వాయర్‌ నిర్మించేందుకు పథకాన్ని ప్రారంభించారు.   

పనులు ఇలా.. 
జిల్లాలో ఈ ప్రాజెక్టు పనులు 15ప్యాకేజీలుగా విభజించి కొనసాగిస్తున్నారు. రిజర్వాయర్ల వారీగా పరిశీలిస్తే నార్లాపూర్‌ రిజర్వాయర్‌కు సంబంధించి మొత్తం 2,465 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,275 ఎకరాల భూమిని సేకరించారు. రూ.760కోట్ల వ్యయానికిగాను రూ.425కోట్లు ఖర్చు చేసి 60శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల రిజర్వాయర్‌కు సంబంధించి 5,470 ఎకరాలు సేకరించాల్సి ఉండగా 5,011 ఎకరాలు సేకరించారు.  మిగిలిన భూసేకరణ వివిధ దశల్లో ఉంది. రూ. 664 కోట్ల వ్యయానికి రూ.622 కోట్లు ఖర్చు చేసి 95శాతం పనులను పూర్తి చేశారు. వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించి 4,526ఎకరాలు సేకరించాల్సి ఉండగా దాదాపు 4 వేల ఎకరాలను సేకరించారు.

రూ.6వేల కోట్ల వ్యయానికి రూ.1800 కోట్లతో 30శాతం పనులు పూర్తి చేశారు. కరివెన రిజర్వాయర్‌కు సంబంధించి 6,676 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉండగా 6,008 ఎకరాలను సేకరించారు. మిగిలిన భూమికి సంబంధించి సేకరణ అంశం వివిధ దశల్లో ఉంది. రూ.760కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులు రూ. 425కోట్ల ఖర్చుతో దాదాపు 60శాతం పూర్తయ్యా యి. కాలువల విషయానికొస్తే నార్లపూర్‌ నుంచి ఏదుల వరకు 8.375 కిలో మీటర్ల కాల్వలను 2, 3 ప్యాకేజీలుగా విభజించి ఇప్పటి వరకు 50శాతం పనులు పూర్తి చేశారు. ఏదుల నుంచి వట్టెం వరకు 6.4 కిలో మీటర్ల కాలువను 6, 7ప్యాకేజీలుగా విభజించి 81శాతం పనులు పూర్తి చేశారు. ఇక వట్టెం నుంచికరివెన వరకు 12కిలో మీటర్ల కాలువను 12వ ప్యాకేజీగా విభజించి 72 శాతం కాలువ పనులను పూర్తి చేశారు. 

మోటార్లకే కేటాయింపు.. 
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల మోటార్లను బిగించనున్నారు. నార్లపూర్‌లో 145మెగావాట్ల సామర్థ్యం గల ఎనిమిది మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ప్రతి రోజు 22వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేసేలా ఇంజనీర్లు డిజైన్‌ చేశారు. అయితే ఇంత సామర్థ్యం గల పంపులు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా వినియోగించకపోవడం విశేషం. పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా మంజూరయ్యే రుణం వీటి కొనుగోలుకే కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో 6.55 టీఎంసీల సామర్థ్యం గల ఏదుల రిజర్వాయర్‌ను రూ.600 కోట్ల అంచనాతో 2015లో అప్పటి రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పనులు ప్రారంభించారు. సొరంగాలు, సర్జిపూల్స్, కాల్వలు పనులు పురోగతిలో ఉన్నాయి. 7.5 కిలోమీటర్ల పొడవైన ఆనకట్ట నిర్మాణం 99 శాతం పూర్తి చేశారు. రూ.400 కోట్ల రిజర్వాయర్‌ నిర్మాణానికి, రూ. 200 కోట్ల కాల్వల నిర్మాణం కోసం కేటాయించారు. ఇక్కడ 1.45 హెచ్‌పీ సామర్థ్యం గల 9 పంపులను ఏర్పాటు చేసి, నీటిని ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టు డిజైన్‌ చేశారు. ఈ రిజర్వాయర్‌కు నీరు వస్తే.. 29 గ్రామాల పరి«ధిలోని 45వేల ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందుతోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటి వరకు 5,011ఎకరాల భూసేకరణ చేశారు. ఇంకా 395 ఎకరాలు భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో 195 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top