1,027 మందికి గ్రూప్‌–2 కొలువులు

Telangana Government Released Group 2 Results In Hyderabad - Sakshi

ఎట్టకేలకు గ్రూప్‌–2 ఫలితాలు

1,027 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసిన టీఎస్‌పీఎస్సీ

కమిషన్‌ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల జాబితా

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్‌–2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. వివాదాలు, న్యాయ సమస్యలతో ఇన్నాళ్లూ ఆగిపోయిన పోస్టుల భర్తీ పూర్తయింది. 2015, 2016 సంవత్సరాల్లో జారీచేసిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1,032 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టగా అందులో 1,027 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసింది. 5 పోస్టులకు అభ్యర్థులు లభించకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచింది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి అధ్యక్షతన కమిషన్‌ కార్యాలయంలో సమావేశం  జరిగింది.

అసలేం జరిగిందంటే..
గ్రూపు–2 పోస్టుల భర్తీకి అదే ఏడాది నవంబర్‌ 11, 13 తేదీల్లో రాత పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షల సమయంలో కొన్ని పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను ఒకరివి మరొకరికి ఇచ్చారు. దీనిని గుర్తించిన ఇన్విజిలేటర్లు వాటిని వెనక్కి తీసుకొని ఎవరి ఓఎంఆర్‌ షీట్లను వారికి ఇచ్చేశారు. అప్పటికే ఓఎంఆర్‌ షీట్‌ తీసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను అందులో నమోదు చేశారు. తరువాత ఎవరి ఓఎంఆర్‌ షీట్లను వారికి ఇచ్చేయడంతో ఆ అభ్యర్థులు వైట్‌నర్‌ ఉపయోగించి తమ వ్యక్తిగత వివరాలను సరిదిద్దారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్లు కూడా టీఎస్‌పీఎస్సీకి నివేదికలు ఇచ్చారు. దీంతో టీఎస్‌పీఎస్సీ ఈ అంశంపై టెక్నికల్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఘటనపై నివేదిక ఇచ్చింది. ఓఎంఆర్‌ షీట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా నమోదు చేసినందున, వైట్‌నర్‌ ఉపయోగించి సరిచేసిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని, వైట్‌నర్‌ ఉపయోగించి పార్ట్‌–బీలోని జవాబులను కనుక దిద్దితే వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని సిఫారసు చేసింది.

దీని ఆధారంగా జవాబు పత్రాలను వాల్యుయేషన్‌ చేసింది. అందులో వైట్‌నర్‌ వాడిన 343 మంది సహా 3,147 మందికి 2017లో 1:3 నిష్పత్తి లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించింది. అయితే వైట్‌నర్‌ ఉపయోగించిన వారికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించవద్దని కొంత మంది కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. వైట్‌నర్‌ ఉపయోగించిన వారిని తొలగించాలని తీర్పు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల మేరకు టీఎస్‌పీఎస్సీ వైట్‌నర్‌ ఉపయోగించిన 343 మందిని తొలగించి.. ఆ తర్వాత మెరిట్‌ లో ఉన్న 343 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించింది.  సింగిల్‌ జడ్జి తీర్పుపై వైట్‌నర్‌ ఉపయోగించిన బాధిత అభ్యర్థులు ధర్మాసనానికి అప్పీల్‌ చేసుకున్నారు. టెక్నికల్‌ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, పార్ట్‌–ఏలో వైట్‌నర్‌ ఉపయోగించిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top