వారం రోజుల్లో సిటీ బస్సులు?

Telangana Government Looking Forward To Run TSRTC In Hyderabad City - Sakshi

కొన్ని రూట్లలోనే తిప్పే అవకాశం

ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ

కేంద్ర మార్గదర్శకాల తర్వాత నిర్ణయం

కరోనా నిబంధనలతో నడపాలని యోచన

భౌతిక దూరం పాటించేలా అధికారుల చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన నేపథ్యంలో నగరంలోనూ సిటీ సర్వీసులను ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 31తో నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగుస్తున్న నేపథ్యంలో కేం ద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలైన నేపథ్యంలో.. సిటీ బస్సులు లేకపోవటంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా సర్వీసులు ప్రారంభించిట్లే.. కరోనా నిబంధనలతో సిటీ సర్వీసులు కూడా ప్రారంభించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వచ్చే నెల మొదటి వారంలో వీటిని ప్రారంభిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న అధికారులు.. వాటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చేనెల 5వ తేదీకి అటుఇటుగా బస్సులు ప్రారంభించే అవకాశం ఉందని ఆర్టీసీలో ప్రచారం జరుగుతోంది.

కండక్టర్‌ లేని ప్రతిపాదన వద్దు..: కరోనా నిబంధనల నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా కండక్టర్లు బస్సుల్లో కాకుండా స్టేజీల వద్దే టికెట్లు జారీ చేసే ప్రతిపాదనను ఆర్టీసీ అధికారులు రూపొందించారు. ప్రతి స్టేజీలో ఇద్దరు చొప్పున కండక్టర్లు ఉండాలని, ఒకరు టికెట్‌ జారీ చేస్తే మరొకరు దిగే ప్రయాణికుల వద్ద టికెట్లు తనిఖీ చేయాలనేది ఆ ప్లాన్‌. కానీ దీన్ని ప్రభుత్వం తిరస్కరించింది. జిల్లా సర్వీసుల తరహాలోనే కండక్టర్లతో కూడిన బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. నిలబడి ప్రయాణించేందుకు అవకాశం ఇవ్వవద్దని నిర్ణయించారు. జిల్లా సర్వీసుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. కానీ, సిటీ బస్సులకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎగబడే పరిస్థితి ఉండటంతో నిలబడకుండా చూడటం కష్టసాధ్యమేనని అధికారులు పేర్కొంటున్నారు. సీట్లు భర్తీ అయ్యాక అదనంగా ఎక్కేవారిని కండక్టర్లు నియంత్రించలేరని, దీనివల్ల ఉద్రిక్తతలకు కారణమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నగరంలో తీవ్రమైన ట్రాఫిక్‌.. 
సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. షేర్‌ ఆటోల్లో కూడా పెద్ద సంఖ్యలో జనం ప్రయాణించే వారు. కానీ అది ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో షేర్‌ ఆటోలను తక్కువ మందే ఆశ్రయిస్తున్నారు. ఎక్కువ మంది సొంత వాహనాలను రోడ్డెక్కించారు. లాక్‌డౌన్‌ వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించిన వారు ఇప్పుడు సొంత వాహనాల్లో వస్తుండటంతో నగర రోడ్లపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు సాధారణ రోజుల్లో ఉన్న ట్రాఫిక్‌ కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ముఖ్యంగా బైక్‌ల సంఖ్య బాగా పెరిగింది. గతంలో ఉదయం, సాయంత్రం ఆఫీసుల ప్రారంభం, ముగిసే వేళల్లో రోడ్లపై వాహనాలు కన్పించేవి. ఇప్పుడు మధ్యాహ్నం పూట కూడా చిన్న రోడ్లు.. బైక్‌లతో నిండిపోతున్నాయి.

ప్రారంభంలో కొన్ని రూట్లకే..
ప్రస్తుతం నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా వెలుగు చూస్తున్నాయి. జియాగూడ, ఆసిఫ్‌నగర్, పాతబస్తీలో ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతాలకు కాకుండా మిగతా ప్రాంతాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. సికింద్రాబాద్, మేడ్చల్, రామచంద్రాపురం, హయత్‌నగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మాదాపూర్‌.. తదితర ప్రాంతాల వైపు ఎక్కువగా తిప్పాలని భావిస్తోంది. కాగా, ప్రస్తుతం డొమెస్టిక్‌ విమానాలు మొదలు కావటంతో విమానాశ్రయంలో కార్యకలాపా లు ప్రారంభమయ్యాయి. నిత్యం 50 వర కు ఆర్టీసీ బస్సులు విమాన ప్రయాణికుల సేవలో ఉండేవి. ప్రస్తుతం అవి నడవట్లేవు. దీంతో విమానాశ్రయానికి వెళ్లేవారు సొంత వాహనాలనే వాడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top