అక్కడ ముందుగానే ఇంటర్నెట్‌!

Telangana Fiber Grid Project - Sakshi

మహేశ్వరం మండలంలో పైలట్‌ ప్రాజెక్టు

నాలుగు గ్రామాల్లో జనవరిలో ట్రయల్‌ రన్‌

ముమ్మర పనులు.. 10 కంపెనీల భాగస్వామ్యం

సాక్షి, హైదరాబాద్‌: ఇంటింటికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కింద 4 గ్రామాలకు ముందుగానే ఇంటర్నెట్‌ సదుపాయం అందనుంది. పైలట్‌ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని మహేశ్వరం, మన్సాన్‌పల్లి, తుమ్మలూరు, సిరిగిరిపురం గ్రామా లకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందించేందుకు అక్కడ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

సిస్కో, హెచ్‌పీ, టెరాసాఫ్ట్, ఇంటెక్స్, డి–లింక్‌ తదితర 10 ప్రముఖ కంపెనీలు ఈ పనుల్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రస్తుతం టెస్టింగ్‌ పనులు జరుగుతుండగా.. వచ్చే నెలలో ఈ గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికి బ్రాడ్‌బాండ్‌ కనెక్షన్‌తోపాటు కేబుల్‌ టీవీ, టెలిఫోన్, టీ–సాట్‌ టీవీ సేవలతోపాటు మీ–సేవ, సీసీ టీవీ.. తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి తొలి వారంలో ఈ గ్రామాల్లోని 50 గృహాలతోపాటు స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు తొలుత ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

30 వేల కి.మీ.ల ఫైబర్‌ డక్ట్‌ రెడీ
తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ (టీ–ఫైబర్‌) ఆధ్వర్యంలో మిషన్‌ భగీరథ ప్రాజెక్టులో అంతర్భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.25 లక్షల కి.మీల మేరకు ఫైబర్‌ డక్ట్‌లను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 30 వేల కి.మీల మేర పని పూర్తయింది. మరోవైపు ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి నిధులను సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top