కమల వికాసంతోనే... తెలంగాణ వికాసం | Telangana Evolution Is Only With BJP | Sakshi
Sakshi News home page

 కమల వికాసంతోనే... తెలంగాణ వికాసం

Nov 15 2018 11:30 AM | Updated on Nov 15 2018 11:31 AM

Telangana Evolution Is Only With BJP - Sakshi

అభివాదం చేస్తున్న స్వామి పరిపూర్ణానంద, బండి సంజయ్, నాయకులు

కరీంనగర్‌సిటీ: కరీంనగర్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ గెలుపుతోనే నీతివంతమైన పరిపాలనాభివృద్ధి సాధ్యమవుతుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కరీంనగర్‌ శివారులోని కొండ సత్యలక్ష్మి గార్డెన్‌లో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛమైన, నీతివంతమైన నాయకుడు బండి సంజయ్‌ అని అన్నారు. బండి సంజయ్‌ గెలుపు కోసం కరీంనగర్‌ మాత్రమే కాకుండా యావత్తు తెలంగాణ ఎదురు చూస్తోందన్నారు. హిందువులందరూ ఒక్కసారి ఏకమై కళ్లు తెరిస్తే ఎలా ఉంటుందో చూపెట్టాలన్నారు. తెలంగాణలో కరీంనగర్‌లోనే బీజేపీకి అత్యధిక మెజార్టీ ఓట్లు వస్తాయన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే యువతకు లక్ష ఉద్యోగాలు ఇచ్చే మాట నిలబెట్టుకునేది బీజేపీ మాత్రమేనన్నారు. 

కరీంనగర్‌ పేరును కూడా మారుస్తామన్నారు. అధికారం రాగానే అమరులైన 1265 మంది ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. కమల వికాసంతోనే తెలంగాణ వికాసం కావాలని ఆకాంక్షించారు. బండి సంజయ్‌ను ఖతం చేస్తామంటూ ఒక నాయకుడు బెదిరించాడని, సంజయ్‌ మీద చేయి వేయాలంటే కాషాయం దాటి వెళ్లాలన్నారు. సంజయ్‌ను కాపాడుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం నన్ను బహిష్కరిస్తే అమిత్‌షా, బీజేపీ నన్ను తెలంగాణలో ఆవిష్కరించారన్నారు. తెలంగాణ వచ్చాక విద్యార్థుల రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు లేకుండా విడుదల చేస్తామన్నారు. అమిత్‌షా అడుగు ప్రతీది విజయమేనన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ విజయం వైపు చూస్తున్నారన్నారు. 

సమావేశంలో బీజేపీ కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణాకర్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాస సత్యనారాయణరావు, కన్నెబోయిన ఓదెలు, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ, తాళ్లపల్లి హరికుమార్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ సతీశ్, జిల్లా కార్యదర్శి మెరుగు పర్శరాం, నాయకులు జవ్వాజి రమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, బోయినిపల్లి ప్రవీణ్‌రావు, బేతి మహేందర్‌రెడ్డి, దాసరి రమణారెడ్డి, కడార్ల రతన్‌కుమార్, సుజాతరెడ్డి, కోమళ్ల రాజేందర్‌రెడ్డి, కటుకం లోకేశ్‌ పాల్గొన్నారు.  

పద్మనగర్‌లో బండి సంజయ్‌ ఇంటింటా ప్రచారం:
అవినీతిరహిత పాలన కోసం బీజేపీని గెలిపించాలని కరీంనగర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కొత్తపల్లి మండలం పద్మనగర్‌లో బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించిన సంజయ్‌ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారాలను కాపాడుకునేందుకే టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు రాజకీయాల్లో కొనసాగుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. 

రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ రాచరిక పాలన సాగుతోందని, ఆ పాలనకు చరమగీతం పాడితేనే ప్రజాపాలన సాధ్యమవుతుందని చెప్పారు. పద్మనగర్‌ ఎంపీటీసీ గుజ్జేటి శివకుమార్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ వార్డుసభ్యుడు దూస సుధాకర్, బోగ అనిల్, రాజు, ప్రశాంత్, కార్తీక్, శ్రావణ్, అజయ్‌లు సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ నాయకులు కడార్ల రతన్‌కుమార్, బండారి పాపయ్య, రాచకొండ కొమురయ్య, మాజీ వార్డు సభ్యులు మల్లేషం, అనిల్, శ్రీదర్, సంతోష్, రాజు, సాయి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement