షాడో నిఘా

Telangana Elections Police Department Surveillance In Warangal - Sakshi

నర్సంపేట:  ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల కమిషన్‌ నిరంతర నిఘా కొనసాగించనుంది. ఇందుకోసం ప్రత్యేక షాడో బృందాలు వారి వెన్నంటే తిరగనున్నాయి. ప్రచారానికి సంబంధించి అభ్యర్థులు ఖర్చును తక్కువగా చూపినా షాడో టీమ్‌లు ఇచ్చే సమాచారం ఆధారంగా అదనపు ఖర్చును వారి ఖాతాల్లోనే జమ చేయనున్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా అదనపు ఖర్చు చేసినట్లు తేలితే గెలుపొందినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయనున్నారు.

ఎన్నికల కమిషన్‌ నూతనంగా రూపొందించిన నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేగా బరిలో ఉన్న అభ్యర్థులు 28 లక్షలకు మించి ఖర్చు చేయడానికి వీలు లేదు. ప్రచార ఖర్చులపై నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాయి.  వీడియో విజువల్స్‌ ధ్వారా వివిధ పార్టీల ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణను చిత్రీకరించనున్నారు. అభ్యర్థులకు తెలియకుండా ఈ ‘షాడో’ టీంలు పని చేస్తాయి. లెక్కలు తప్పు చూపించిన సమయంలో.. షాడో టీంల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా మిగతా నగదును ఆయా అభ్యర్థుల లెక్కల్లో జమ చేయనున్నారు.ర్యాలీలు, సభలు నిర్వహించే క్రమంలో అభ్యర్థుల ఫొటోలు ఉంటే.. ఖర్చు వారి ఖాతాలోకి వెళ్లనుంది. కేవలం పార్టీ పేరుతో ప్రచారం చేసుకుంటే మాత్రం ఖర్చుకు పరిమితి లేదు.

అభ్యర్థులకు ప్రత్యేక నోట్‌బుక్‌ ...
ప్రచారానికి సంబంధించి ఖర్చుల వివరాలను నమోదు చేసేందుకు ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఎలక్షన్‌ కమిషన్‌ రూపొందించిన ప్రత్యేక నోట్‌బుక్కును అందించనున్నారు. అందులో రోజువారి ఖర్చు, బ్యాంకు లావాదేవీలతోపాటు తదితర వివరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత రూ.28 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు నిర్ధారణ జరిగితే.. గెలుపొందినప్పటికీ వారి అభ్యర్థిత్వం రద్దు చేయనున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు సైతం నిబంధనలకు మించి ఖర్చు పెట్టినట్లు తేలితే ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంది.

రూ.50 వేలకు మించితే  లెక్క చూపాల్సిందే..
జిల్లా పరిధిలోని నర్సంపేట నియోజకవర్గంలో మూడు చోట్ల చెక్‌పోస్ట్‌లు, పరకాల నియోజకవర్గంలో రెండు చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసి వాహనాలను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. సామాన్య పౌరులు సైతం అవసరాల నిమిత్తం రూ.50 వేల వరకు వెంట తీసుకెళ్లడానికి మాత్రమే వీలుంది. ఆ డబ్బులు తనిఖీల్లో పట్టుబడినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంతకు మించి ఒక్క రూపాయి ఎక్కువగా తీసుకున్నా  ఆ డబ్బులకు సంబంధించి పూర్తి వివరాలు తనిఖీ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేదంటే అధికారులు ఆ డబ్బును సీజ్‌ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తారు.
 
బ్యాంకు లావాదేవీలపై నిఘా...
బ్యాంకు లావాదేవీలపై కూడా ఎన్నికల అధికారులు నిరంతరం నిఘా వేయనున్నారు. రోజువారీగా బ్యాంకు లావాదేవీలు చేసే వ్యక్తుల వివరాలను లీడ్‌బ్యాంకు మేనేజర్‌ ద్వారా ఎన్నికల అధికారులకు బ్యాంకు మేనేజర్లు చేరవేయనున్నారు. ఎన్నికల కోడ్‌ పూర్తయ్యే వరకు రూ.500 డ్రా చేసినా, డిపాజిట్‌ చేసినా నిఘా ఉండబోతుంది. ముఖ్యంగా రూ.10 లక్షలు, ఆ పైన నగదు లావాదేవీలను చేసే వారి పూర్తి వివరాలను ఇప్పటికే అధికారులు బ్యాంకర్ల నుంచి సేకరిస్తున్నారు. ఏటీఎంలో నగదు వేసే వాహనాలపై సైతం నిఘా ఉండనుంది. ఏటీఎంలో నగదు వేసే ఆయా ఏజెన్సీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top