సమరానికి సై 

Telangana Elections Nominations Over Khammam - Sakshi

కీలక ఘట్టం ముగిసింది.. ఇక పోరు తుది ప్రచారానికి తెరలేచింది.. బరిలో నిలిచిన అభ్యర్థులు నిద్ర లేచింది మొదలు కాలికి, నోటికి, చేతికి పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.. గడప గడపకూ తిరగాలి.. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి.. ఓటున్న ప్రతి ఒక్కరినీ పలకరించాలి.. అయినోళ్లయినా.. కానోళ్లయినా.. ఆఖరికి ప్రత్యర్థి అయినా.. అవసరం మరి.. ఓటు విలువంటే ఇప్పుడే కదా తెలిసేది.. గెలిపిస్తే చేసే అభివృద్ధి గురించి వివరించాలి.. అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలి..ఓటరు నాడి పట్టుకోవాలి.. ఇలా శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఉన్న సమయాన్నిసాధ్యమైనంతవరకు పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులను వెంటేసుకుని ఓటర్లను కలిసే పనిలో పడ్డారు. బరిలో నిలిచే అభ్యర్థులు గురువారం ఖరారు కావడంతో ప్రచారాన్ని మరింత ఉరకలెత్తించేందుకు సిద్ధమవుతున్నారు.

సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 133 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజు కావడంతో గురువారం 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించి.. రాకపోవడంతో బరిలో నిలిచిన తిరుగుబాటు, స్వతంత్ర అభ్యర్థులను పార్టీల ముఖ్య నేత లు, అభ్యర్థులు బుజ్జగించడంతో ప్రధాన పార్టీల నుంచి తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా అనేక మంది ఉపసంహరించుకున్నారు. ఖమ్మం జిల్లాలో నామినేషన్ల పరిశీలన అనంతరం 76 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 14 మంది అభ్యర్థులు వివిధ కారణాలతో ఉపసంహరించుకున్నారు. దీంతో జిల్లాలో మొత్తం 62 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నామినేషన్ల పరిశీలన తర్వాత 93 మంది అభ్యర్థులు ఉండగా.. వారిలో 22 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో భద్రాద్రి జిల్లా నుంచి 71మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

బుజ్జగింపులతో వెనక్కు.. 
పార్టీ టికెట్‌ రాకపోవడంతో నామినేషన్‌ వేసిన పలువురు అభ్యర్థులు బుజ్జగింపులతో వెనక్కు తగ్గారు. వీరిలో ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ రాకపోవడంతో రెబెల్‌గా నామినేషన్లు వేసిన ఇద్దరు అభ్యర్థులున్నారు. చీమల వెంకటేశ్వర్లు, దళ్‌సింగ్‌నాయక్‌లను కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హరిప్రియనాయక్, ఇతర ముఖ్య నేతలు నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బుజ్జగించడం.. భవిష్యత్‌లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీయే అని.. పార్టీ, ప్రభుత్వపరంగా అనేక అవకాశాలు ఉంటాయని వారికి నచ్చజెప్పారు. దీంతో ఇద్దరు నేతలు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇదే ప్రయత్నం వైరాలో కాంగ్రెస్‌ నేతలు చివరి నిమిషం వరకు చేసినా ఫలించలేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశించిన రాములునాయక్‌ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఈ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆయనకు కొందరు కాంగ్రెస్‌ శ్రేణులతోపాటు టీఆర్‌ఎస్‌లోని అసమ్మతి వర్గం వెన్నుదన్నుగా నిలిచింది.

దీంతో కాంగ్రెస్‌ నేతలు, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలైన సీపీఐ వర్గాలు ఆయనతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి కొందరు కాంగ్రెస్‌ నేతలను దూతలుగా పంపించి.. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినా ఆయన అంగీకరించలేదు. దీంతో నామినేషన్‌ ఉపసంహరణ గడువు వరకు వివిధ రకాల ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్‌ నేతలు రాములునాయక్‌ వినకపోవడంతో వెనుదిరిగారు. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన సున్నం నాగమణి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు ఆమెను సంప్రదించి.. ప్రజాకూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న మెచ్చా నాగేశ్వరరావుకు మద్దతుగా నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని అభ్యర్థించడంతో ఆమె నామినేషన్‌ను ఉపసంహరించుకుని మెచ్చా విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు.

అలాగే అశ్వారావుపేటలో తెలంగాణ జనసమితి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మక్కా ప్రసాద్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ తిరుగు బాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన ఫజల్‌ అహ్మద్‌ను నామినేషన్‌ ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోర డం.. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఆయనకు నచ్చజెప్పడంతో నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడం తో ఎన్నికల బరిలో ఎవరెవరు ఉంటున్నారనే అంశం స్పష్టం కావడంతో ఆయా రాజకీయ పక్షా లు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. ఇక ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య చేత నామినేషన్‌ ఉపసంహరింపజేసేందుకు కాంగ్రెస్, ప్రజాకూటమి భాగస్వామ్య పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బరిలో నుంచి తప్పుకునేది లేదంటూ అబ్బయ్య ప్రకటించడంతో కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర నాయకులతో మాట్లాడించారు. అయినా అబ్బయ్య వెనక్కు తగ్గక.. చివరికి బరిలో నిలిచారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top