బరిలో..‘వీరు’లు! 

Telangana Elections Main Candidates In Nalgonda - Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ :  ఆరు నియోజకవర్గాలు .. వంద మంది అభ్యర్ధులు. నల్లగొండ జిల్లా ఎన్నికల బరిలో వివిధ రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్నవారు, స్వతంత్రులు కలిపి అభ్యర్ధుల సంఖ్య సెంచరీ దగ్గర ఆగిపోయింది. ప్రధా న పార్టీలను మినహాయిస్తే వీరిలో ఇండిపెండెం ట్లు ఏకంగా ... మంది పోటీలో ఉన్నారు.  గురువారం ముగిసిన నామినేషన్ల ఉప సంహరణ తర్వాత ఈ లెక్క తేలింది. అత్యధికంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి 29 మంది అభ్యర్ధులు పోటీ పడుతుండగా, అతి తక్కువగా దేవరకొండనుంచి 10 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. టికెట్లు రాక అలక బూని రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారు ఉపసంహరణ రోజు వెనక్కి తగ్గారు.

మిర్యాలగూడలో నాటకీయ పరిణామాలు 
మిర్యాలగూడ నుంచి సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి టికెట్‌ ఆశించారు. చివరి  నిమిషం దాకా ఢిల్లీలో ఉండి ప్రయత్నాలు చేసినా, టికెట్‌ దక్కలేదు. ఇక, టీఆర్‌ఎస్‌లో టికెట్‌ దక్కక కాంగ్రెస్‌ గూటికి చేరిన అలుగుబెల్లి అమరేందర్‌ రెడ్డికి అక్కడా చుక్కెదురైంది. రఘువీర్‌కు టికెట్‌ ఇవ్వని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని అలుగుబెల్లి కోరారు.  కాంగ్రెస్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న ఆయన చివరకు రెబల్‌గా బరిలోఉంటానని నామినేషన్‌ కూడా దాఖలు చేశారు.

ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీలో ఇటీవలే చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే , బీసీ నేత ఆర్‌.కృష్ణయ్యకు కేటాయించింది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో ఆయన తన నామినేషన్‌ను ఉప సంహరించుకోక తప్పలేదు. ఒకవేళ తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కు  ఈ స్థానాన్ని కేటాయిస్తే మాత్రం బరిలో కొనసాగుతానని ముందే ప్రకటించారు. చివరకు ఈ సీటును కాంగ్రెస్‌కే ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. ముందు నుంచీ ఈ స్థానం తమకు కేటాయించాలని పట్టుబట్టిన టీజేఎస్‌ తమ అభ్యర్థిగా విద్యాధర్‌ రెడ్డిని ప్రకటించి బీఫారమ్‌ కూడా ఇచ్చింది. దీంతో ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. కానీ, ఉప సంహరణ రోజు టీజేఎస్‌ అభ్యర్థి సైతం పక్కకు తప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్‌కు రెబల్స్‌ బెడదతోపాటు, టీజేఎస్‌ నుంచి స్నేహపూర్వక పోటీ కూడా తప్పిపోవడంతో  పార్టీ నాయకత్వం ఊపిరి పీల్చుకుంది.

నకిరేకల్‌లో కాంగ్రెస్‌కు ‘ఇంటి’ పార్టీ మద్దతు
మహాకూటమిలో చేరిన రోజునుంచి తమకు నకిరేకల్‌ స్థానం కావాలని డిమాండ్‌ చేసిన తెలంగాణ ఇంటి పార్టీ చివరకు ఆ స్థానం నుంచి పక్కకు తప్పుకుంది. ఆ పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన చెరుకు లక్ష్మి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్‌ తరఫున బరిలో ఉన్న చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా పనిచేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ప్రకటించారు. కాగా, మునుగోడు నియోజకవర్గంలో మాత్రం ఇంటి పార్టీ అభ్యర్థి పోటీలోనే ఉన్నారు.

సీట్ల కేటాయింపు సమయంలో ఒక దశలో నకిరేకల్‌ను ఇంటి పార్టీకి కేటాయించినట్లు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా ప్రకటన కూడా చేశారు. కానీ, కాంగ్రెస్‌ జిల్లా నాయకత్వంనుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో చివరకు చిరుమర్తినే టికెట్‌ వరించింది. రాష్ట్రంలో రెండు స్థానాలు కోరిన ఇంటి పార్టీ జిల్లాలో కనీసం ఒక్క స్థానమైనా కేటాయించాలని ఒత్తిడి పెంచినా ఉపయోగం లేకపోవడంతో నకిరేకల్‌లో పోటీకి దిగింది. కానీ, చివరకు నామినేషన్‌ను ఉపసంహరించుకుని చిరుమర్తికి మద్దతు ప్రకటించింది.

పోటీలో 46 మంది స్వతంత్రులు
జిల్లా పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో నూరు మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, వారిలో స్వతంత్రులే 46 మంది ఉన్నారు. మిగిలిన 54 మంది ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. అత్యధికంగా మిర్యాలగూడ బరిలోనే 18 మంది ఇండిపెండెంట్లుగా ఉన్నారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో ఆరుగురు, నకిరేకల్‌లో ఇద్దరు, మునుగోడులో ఆరుగురు, దేవరకొండలో ముగ్గురు, నల్లగొండ నియోజకవర్గంలో పదకొండు మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top